అప్పుడు 20.. ఇప్పుడు 16..
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:56 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో చేపట్టిన రహదారి నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 20 రోడ్ల పనులకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇందులో రూ.33.1 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా మరో 16 రోడ్ల పనులకు సంబంధించి రూ.21.87 కోట్లు దుర్వినియోగమైనట్లు శ్రీకాకుళం విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు వెళ్లాయి.
రూ.54.88 కోట్ల పనులపై ఆరోపణలు
విచారణ ప్రారంభించిన విజిలెన్స్ విభాగం
గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారుల్లో అలజడి
సీతంపేట రూరల్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో చేపట్టిన రహదారి నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 20 రోడ్ల పనులకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇందులో రూ.33.1 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా మరో 16 రోడ్ల పనులకు సంబంధించి రూ.21.87 కోట్లు దుర్వినియోగమైనట్లు శ్రీకాకుళం విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు వెళ్లాయి. మొత్తంగా 36 రహదారులకు గాను రూ.54.88 కోట్లు అక్రమాలు జరిగినట్లు తెలిసింది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సంబంధిత అధికారులు రంగంలోకి దిగడంతో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారుల్లో అలజడి మొదలైంది.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, పాతపట్నం, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పలాస మండలాల్లో మారుమూల గిరిజన గ్రామాల్లో 2019- 2023 వరకు రహదారి పనులు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి నిధులతో రోడ్లను నిర్మించారు. కాగా సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా రహదారుల పనుల్లో అక్రమాలు జరిగినట్లు పలువురు విడతల వారీగా శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రోడ్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు సీతంపేట గిరిజన సంక్షేమ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 20 రహదారులకు సంబంధించి కొంతవరకు సమాచారం ఇవ్వడంతో విజిలెన్స్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. తాజాగా మరో 16 రోడ్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం సీతంపేట ఏజెన్సీలో రహదారి పనులను పరిశీలించి ఆధారాలను సేకరించారు. విచారణ త్వరగా పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
టీడబ్ల్యూ ఈఈ ఏమన్నారంటే..
గతంలో నిర్మించిన 20 రహదారులతో పాటు మిగిలిన మరో 16 రోడ్ల పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు పూర్తి సమాచారాన్ని ఇస్తున్నాం. విజిలెన్స్ అధికారుల విచారణ కూడా మొదలైంది.
- ఎస్.సింహాచలం, ఈఈ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ, సీతంపేట ఐటీడీఏ