Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పొలంలోకి దూసుకెళ్లిన ట్రావెల్‌ బస్సు

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:29 PM

పార్వతీపురం నుంచి కాశీకి యాత్రీకులతో బయలుదేరిన ట్రావెల్‌ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది.

పొలంలోకి దూసుకెళ్లిన ట్రావెల్‌ బస్సు
పొలంలోకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు

- ప్రమాదం నుంచి బయటపడిన కాశీ యాత్రికులు

- ఐదుగురికి స్వల్ప గాయాలు

గరుగుబిల్లి, మార్చి 3: పార్వతీపురం నుంచి కాశీకి యాత్రీకులతో బయలుదేరిన ట్రావెల్‌ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి స్పల్ప గాయాలు కాగా మిగతా వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని చిలకాం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. పార్వతీపురం నుంచి కాశీ తీర్థ యాత్రకు 22 మంది ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో బయలుదేరారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రయాణం ప్రారంభమైన కొద్ది సేపటికే మండలంలోని చిలకాం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న బస్‌ షెల్టర్‌ను ఢీకొని పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారు క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన వారిని పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదాలకు నిలయంగా చిలకాం మలుపు

చికలాం మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందట తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన 15 మంది ఆటోలో వివాహానికి వెళ్తుండగా చికలాం మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నవారంతా గాయపడ్డారు. అలాగే రావివలసకు చెందిన ఓ వ్యక్తిని ఈ మలుపులోనే లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మలుపు వద్ద స్పీడు బ్రేకర్లతో పాటు హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదా లు జరుగుతున్నాయని ఎంపీటీసీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ అన్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:29 PM