శ్యామలాంబ పండగకు ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:25 AM
సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ పండగకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 18,19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించాలని నిశ్చయించారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత పండగ జరపాలని నిర్ణయించడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 14 ఏళ్ల తర్వాత ఉత్సవాలు
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు
సాలూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ పండగకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 18,19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించాలని నిశ్చయించారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత పండగ జరపాలని నిర్ణయించడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పట్టణంలో శ్యామలాంబ ఆలయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సాలూరు యువరాజు, అనువంశిక ధర్మకర్త సన్యాసిరాజు, పట్టణ ప్రముఖులు, పెద్దలు, పార్టీలక తీతంగా హాజరైన నాయకులు పండగపై చర్చించారు. వచ్చే ఏడాది మే 18న ఉయ్యాల కంబాల, 19న తొలేళ్లు, 20న ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం, 21న అనుపోత్సవం జరపాలని నిర్ణయించారు. వాస్తవంగా సాలూరులో తొమ్మిదేళ్లకొకసారి శ్యామలాంబ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అయితే 2010 తర్వాత అనివార్య కారణాలతో ఉత్సవాలు నిర్వహించలేదు. 2018లో కొత్తమ్మ తల్లి పండగను మాత్రమే చేశారు. 2019లో శ్యామలాంబ పండగ జరగాల్సి ఉండగా ఆ ఏడాది మేలో ఎన్నికలు జరగొచ్చని (అయితే ఎన్నికలు 2019, ఏప్రిల్ 11న జరిగాయి ) రాజకీయ కారణాల వల్ల వాయిదా వేశారు. అనంతరం 2020, 2021 కరోనా ప్రభావంతో పండగ నిర్వహణపై చర్చించలేదు. అయితే ఎట్టకేలకే ఉత్సవాలకు ముహూర్తం ఖారారు చేయడం తో సాలూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పరంగా సహకారం..
సాలూరు పండగను ఘనంగా నిర్వహించేందుకు పెద్దలు, అనుభ వజ్ఞనులు తమ సలహా, సూచనలు అందజేయాలని మంత్రి సంధ్యారాణి కోరారు. ఉత్సవాల నిర్వహణకు తనతో పాటు ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ మాట్లాడుతూ సాలూరు గ్రామదేవత పండగను ఏకగ్రీవ తీర్మానంతో పార్టీలకతీతంగా నిర్వహించాలని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లా డుతూ.. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం నిర్వహణకు కమిటీలు వేస్తామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఈశ్వరమ్మ , ఆలయ ఈవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దుగ్ధసాగరానికీ పండగే..
సాలూరు రూరల్: సాలూరుకు కూతవేటు దూరంలో వేగావతినదికి పశ్చిమతీరంలో ఉన్న దుగ్ధసాగరం గ్రామానికి సైతం శ్యామలాంబ పండ గొచ్చింది. సాలూరు గ్రామదేవత ఉత్సవాలు నిర్వహించే తేదీల్లోనే అక్కడ కూడా పండగను చేయనున్నారు. ఇది పూర్వం నుంచి ఆచారంగా వస్తుందని గ్రామానికి చెందిన వృద్ధుడు చిన్న తెలిపాడు. మొత్తంగా దుగ్ధసాగరం వాసులు సైతం ఆయా తేదీల్లో పండగ చేయడానికి సన్నద్ధమవుతున్నారు.