Share News

పీవో పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:58 PM

ఎన్నికల్లో పీవోల పాత్ర అత్యంత కీలకమని కలెక్టరు నాగలక్ష్మి అన్నారు. ఒక్క తప్పు కూడా చోటు చేసుకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఎన్నికల ప్రక్రియ, విధులు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

 పీవో పాత్ర కీలకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

పీవో పాత్ర కీలకం

పోలింగ్‌ రోజున ఒక్క తప్పు కూడా చేయకూడదు

కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, మార్చి 27: ఎన్నికల్లో పీవోల పాత్ర అత్యంత కీలకమని కలెక్టరు నాగలక్ష్మి అన్నారు. ఒక్క తప్పు కూడా చోటు చేసుకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఎన్నికల ప్రక్రియ, విధులు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల నుంచి మాస్టర్‌ ట్రెనీలుగా ఎంపికైన ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ రోజున అక్కడి పీవోదే సర్వాధికారమని చెప్పారు. అందరి విధులపైనా పీవోలకు అవగాహన ఉండాలని గుర్తుచేశారు. పోలింగ్‌కి 90 నిమిషాల ముందే మాక్‌పోల్‌ నిర్వహించాలని, ముందురోజు రాత్రే తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 5.30కే మాక్‌ పోల్‌ జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ త్రివినాగ్‌, డీఆర్‌వో అనిత, నోడల్‌ అధికారి సుధాకర్‌, ఆర్‌వోలు సూర్యకళ, శాంతి, సాయిశ్రీ, నూకరాజు, మురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లయ్య నాయుడు తదితరులు ఉన్నారు.

పార్టీల రంగులు తొలగించాలి

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, భవనాలపై ఉన్న పార్టీల రంగులను తొలగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సి.విజిల్‌ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై వంద నిమిషాల్లోపే చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలన్నారు. ప్రైవేటు భవనాలపై ఏదైనా ఒక పార్టీ జెండా, చిన్న బ్యానర్‌ లేదా స్టిక్కర్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తామని, అయితే ఆభవన యజమాని రాతపూర్వక అనుమతి ఉండాలని అన్నారు. ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలపై పార్టీ జెండాలు, స్టిక్కర్లు ఏర్పాట్లు చేసుకోవచ్చునని, అవి మోటరు వాహన చట్టానికి లోబడి ఉండాలని అన్నారు. వాణిజ్య పరమైన, రవాణా వాహనాలపై జెండాలు, స్టిక్కర్ల ఏర్పాటుకు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు.

- రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పెండింగులో ఉన్న ఫారం-7,8ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతుల జారీ, సి.విజిల్‌ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై మాట్లాడారు.

ఏప్రిల్‌ 14 లోగా ఓటు కోసం దరఖాస్తు

అర్హులైన వారంతా ఏప్రిల్‌ 14వ తేదీ లోగా కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టరు నాగలక్ష్మి సూచించారు. ఆ దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 14 తరువాత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిశీలించి ఓటు హక్కు కల్పించేందుకు సరిపడా సమయం ఉండదని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన చాంబర్‌లో బుధవారం ఆమె మాట్లాడారు.

============

Updated Date - Mar 27 , 2024 | 11:58 PM