పింఛన్ల మాయ
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:41 PM
వైసీపీ పాలనలో పింఛన్‌దారుల ఎంపికలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైకల్యం లేకపోయినా, ఎక్కువ భూములు ఉన్నా, వయసు తక్కువగా ఉన్నా పింఛన్లకు ఎంపిక చేశారు.

- వైకల్యం లేకపోయినా అర్హులే
- ఆస్తిపరులు.. భూములున్నా ఓకే
- వయసు తక్కువగా ఉన్నా పర్వాలేదు
- వైసీపీ పాలనలో అనర్హులకు పింఛన్లు
- ఇష్టారాజ్యంగా ఎంపిక చేసిన వలంటీర్లు
- వైసీపీ నాయకుల అండదండలతోనే..
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ పాలనలో పింఛన్‌దారుల ఎంపికలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైకల్యం లేకపోయినా, ఎక్కువ భూములు ఉన్నా, వయసు తక్కువగా ఉన్నా పింఛన్లకు ఎంపిక చేశారు. వైసీసీ నాయకులు అండదండలతో వలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అర్హత లేకపోయినా వైసీసీ సానుభూతి పరుడైతే చాలు పింఛన్‌కు అర్హుడే అన్న చందాన వ్యవహరించారు. చాలామంది అనర్హులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పింఛన్లు అందుకుంటున్నారు. దీనిపై టీడీపీ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారడంతో నాటి అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక్క మన జిల్లాలోనే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం పింఛను రూపంలో అనర్హుల చేతుల్లోకి వెళ్తోంది.
- విజయనగరం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్త బతికుండగానే చనిపోయినట్లు వితంతు ధ్రువపత్రం చేయించుకుంది. ఈ ధ్రువపత్రంతో కొన్నేళ్లుగా ఆమె పింఛను పొందుతోంది. వృద్ధాప్య పింఛను పొందాలంటే 60 ఏళ్లు దాటాలి. వితంతువులకు వయసుతో సంబంధం ఉండదు. దీంతో కొందరు ఈ మకిలీ పనికి ఒడిగట్టి పింఛన్లు పొందుతున్నారు.
- చీపురుపల్లికి చెందిన ఒకాయన వయసు 50 ఏళ్లు. వైసీపీ నాయకుడి అనుచరుడు. దీంతో వయసు 60 ఏళ్లు ఉన్నట్టు ఆధార్ కార్డుల్లో మార్పించి గత మూడేళ్లుగా వృద్ధాప్య పింఛను పొందుతున్నాడు.
జిల్లాలో వేల సంఖ్యలో బోగస్ పింఛన్ల దందా నడుస్తోంది. నకిలీ ధ్రువపత్రాలతో చాలామంది పింఛన్లు పొందుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు బోగస్ ధ్రువపత్రాలు విచ్చలవిడిగా మంజూరవుతున్నాయి. దీనికి జిల్లా కేంద్రంలో ఒక ముఠా నడుస్తోంది. వివిధ మండలాల నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రికి లేదా జిల్లాలో సదరం శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ల వద్ద ఈ ముఠా వాలిపోతుంది. ఆపై ఆ వైద్యుల వద్దకు సదరం ధ్రువపత్రం కోసం వచ్చే అభ్యర్థి వద్ద రూ.10వేల వరకు వసూలు చేసి కథ నడిపిస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా బోగస్ పింఛన్లు గత ఐదేళ్లలో పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. భూములు ఎక్కువగా ఉన్నా కొంత మంది పింఛన్లు పొందుతున్నారు. అలాగే ఒక రేషను కార్డుపై ఒక పింఛను మాత్రమే అర్హతగా ఉంది. కానీ ఒకే ఇంటిలో ఇద్దరు చొప్పున పింఛన్లు పొందుతున్న వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. అలాగే మరికొందరు తమకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా బోగస్ సర్టిఫికెట్లతో ఎంచక్కా వేల రూపాయల పింఛను పొందుతున్నారు. అదే విధంగా కొంతమంది మహిళలు తమ భర్తలకు దూరంగా ఉంటున్నారు. అయితే, వారు తమ భర్తలు చనిపోయారంటూ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి వితంతు పింఛన్లు అందుకుంటున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున బోగస్ పింఛన్లు మంజూరయ్యాయి. ప్రతి గ్రామం, వార్డులో అనర్హులు ఉన్నట్లు సమాచారం. కాగా, అన్ని అర్హతలు ఉన్నా చాలామందికి పింఛన్లు మంజూరు కాలేదు. అలాగే, అర్హుల పింఛన్లు కూడా వివిధ కారణాలను చూపి వలంటీర్లు తొలగించారు. 300 యూనిట్లు దాటి విద్యుత్ వాడుతున్నట్లు వేరే వినియోగదారుని మీటరుకు అర్హుడి ఆధార్‌ను లింక్ చేసి పింఛన్ల తొలగింపునకు ఒడిగట్టిన సంఘనలు ఉన్నాయి. ఈ అక్రమ పింఛన్లపై నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహించి బోగస్ పింఛన్లను ఏరివేయాలని, అర్హులకు మంజూరు చేయాలని కోరుతున్నారు.
11111111111111111111111