Share News

తొలిరోజు ప్రశాంతం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:49 PM

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 6,208 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5,869 మంది హాజర య్యారు. 339 మంది గైర్హాజరయ్యారు.

తొలిరోజు ప్రశాంతం
పార్వతీపురంలో పరీక్షలను పర్యవేక్షిస్తున్న ఇంటర్‌ జిల్లా విద్యాశాఖాధికారి మంజులవీణ

పార్వతీపురం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి)/బెలగాం: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 6,208 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5,869 మంది హాజర య్యారు. 339 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 3420 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 2,945 మంది హాజరయ్యారు. 475 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి డి.మంజుల వీణ తెలిపారు. జిల్లాలో మొత్తం 32 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా విద్యార్థులు ముందుగా ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకుని ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అధికారులు తనిఖీ చేసి పరీక్ష హాల్‌లోకి అనుమతించారు. మొదటి రోజున ప్రథమ సంవ త్సరం విద్యార్థులు పరీక్ష రాశారు. తెలుగు, సంస్కృతం, హిందీ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించారు. ఇదిలా ఉండగా పార్వతీపురంలో కొంతమంది విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌ సందర్శించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, భద్రతా పరమైన చర్యలను పరిశీలించారు.

ఒక వైపు పరీక్ష..మరో వైపు నిర్మాణ పనులు

పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక వైపు విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ..మరో వైపు అదే కాలేజీలో గేటు అమర్చేందుకు పనుులు చేపట్టారు. పాత గేటు ఉన్నప్పటికీ.. నాడు-నేడు పనులకు సం బంధించి మెటీరియల్స్‌ వాహనాలు రాకపోకలకు ఇబ్బందింగా ఉండడంతో పక్కనే మరొక గేటు అమర్చేందుకు పనులు చేపట్టారు. అయితే పరీక్ష సమయంలో గేటు నిర్మాణ పనులు చేపట్టడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వాపోయారు.

నది దాటడమే ఓ పరీక్ష..

కొమరాడ: ప్రమాదకరమని తెలిసినా నది దాటుతున్న ఈ విద్యార్థుల స్వగ్రామం కొమరాడ మండలం కొట్టు. ఈ గ్రామం నుంచి ఇద్దరు విద్యార్థులు కొమరాడలో జరుగుతున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు శుక్రవారం నాగావళి నదిలో దిగి ఇలా ప్రయాణించారు. ఇలా ఒక్క కొట్టు గ్రామస్థులే కాదు దాదాపు 8 గ్రామ పంచాయతీల పరిధిలోని 32 గ్రామాల ప్రజల సమస్య ఇది. మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఈ పంచాయతీల ప్రజలు వ్యయ ప్రయాసలు పడాల్సిందే. కొమరాడ మండలానికి 8 పంచాయతీలు నాగావళి నది ఆవల ఉన్నాయి. వీరు వర్షా కాలంలో పడే బాధలు వర్ణనాతీతం. సాధారణ రోజుల్లో నాగావళి నదిలో నీటి ప్రవాహం లేనప్పుడు ఎటువంటి భయం లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ చిన్నపాటి వర్షం పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అత్యవసర, అనారోగ్య సమయాల్లో అయితే అతి కష్టం మీద నదిని దాటే సందర్భాలు అనేకం. ప్రస్తుతం చిన్నపాటి వర్షాలు పడుతుండటంతో నదిలో నీరు వచ్చి చేరుతుంది. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అతి కష్టం మీద చేరుకుంటున్నారు. పరీక్ష కంటే నది దాటడమే అసలైన పరీక్షగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పూర్తయితే కానీ తమ కష్టాలు తీరేవని వారు చెబుతున్నారు.

కాలయాపన చేసిన వైసీపీ

పూర్ణపాడు - లాబేసు వంతెన దశాబ్దాల కల. 2006లో దాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. మొండి గోడలతోనే దర్శనమిస్తుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 10 కోట్లు మంజూరయ్యాయి. 80 శాతం పనులు పూర్తి చేశారు. కానీ ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం, తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. నిధులు కాస్త వెనక్కి వెళ్లిపోయాయి. వంతెన నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు తప్ప పనులను పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నది ఈ ప్రాంతవాసుల ఆవేదన.

Updated Date - Mar 01 , 2024 | 11:49 PM