Share News

జిల్లాను ఏర్పాటు చేశారు.. అలానే వదిలేశారు..

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:11 PM

గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే భవనాలు, వసతుల కల్పన, అధికారుల నియామకంపై మాత్రం దృష్టి సారించలేదు. కనీసం జిల్లాకేంద్రం పార్వతీపురంలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను సమకూర్చలేకపోయింది. ఐదేళ్ల పాలనలో ఒక్క భవన నిర్మాణం కూడా చేపట్టలేకపోయింది. అదే విధంగా కీలక శాఖల్లో పోస్టులను భర్తీ చేయలేదు.

జిల్లాను ఏర్పాటు చేశారు..  అలానే వదిలేశారు..
కలెక్టర్‌ కార్యాలయం

పోస్టుల భర్తీ, అధికారుల నియామకం ఊసే లేదు..

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గూడు కరువు..

ఏళ్లుగా పరాయి పంచనే నిర్వహణ

ప్రజలకు పూర్తి స్థాయిలో అందని సేవలు

నూతన ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే భవనాలు, వసతుల కల్పన, అధికారుల నియామకంపై మాత్రం దృష్టి సారించలేదు. కనీసం జిల్లాకేంద్రం పార్వతీపురంలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను సమకూర్చలేకపోయింది. ఐదేళ్ల పాలనలో ఒక్క భవన నిర్మాణం కూడా చేపట్టలేకపోయింది. అదే విధంగా కీలక శాఖల్లో పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందలేదనేది కాదనలేని వాస్తవం. పార్వతీపురంలో కలెక్టరేట్‌ కోసం గత ప్రభుత్వం స్థల పరిశీలన చేసి.. నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించినప్పటికీ ఏ పనులూ చేపట్టలేదు. ఐదేళ్లూ.. మాటలతోనే గడిపేసింది. పార్వతీపురంలో ఐటీడీఏ కోసం నిర్మించిన భవనాల్లోనే నేటికీ కలెక్టరేట్‌ కొనసాగుతుండగా, పట్టణంలో ఓ ప్రైవేట్‌ పాఠశాల భవనాల సముదాయంలో మిగతా ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ వైటీసీలోనే ఎస్పీ కార్యాలయం కొనసాగుతోంది. కొత్త జిల్లాలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఇంకా ఎన్నో సమస్యలు జిల్లాను వెంటాడుతున్న నేపథ్యంలో వాటిపై టీడీపీ కూటమి సర్కారు దృష్టి సారించాల్సి ఉంది.

ఖాళీలు ఇలా..

గత వైసీపీ సర్కారు జిల్లాలో కీలకశాఖల్లో పోస్టులను భర్తీ చేయకపోగా, ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో... ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. మన్యంలో జిల్లా మలేరియా అధికారి పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు తప్ప పూర్తిస్థాయి అధికారిని నియమించ లేదు. గతంలో పనిచేసిన అధికారి రిటైర్డ్‌ కావడంతో ప్రస్తుతం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా సీతంపేట డిప్యూటీ డీఎంహెచ్‌వో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో డీసీహెచ్‌వో పోస్టు ఖాళీగానే ఉంది. ఇక జిల్లా స్పోర్ట్స్‌ అధికారి పోస్టును కూడా భర్తీ చేయలేదు. దీంతో విజయనగరం జిల్లా స్పోర్ట్స్‌ అధికారి మన్యం జిల్లాకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖలో కీలకమైన డీఆర్వో పోస్టును భర్తీ చేయలేదు. దీంతో ఇన్‌చార్జి డీఆర్వోగా కేశవనాయుడు విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో ఆయనకు కూడా బదిలీ జరిగే అవకాశం ఉంది. జిల్లా గృహ నిర్మాణ శాఖ మేనేజర్‌ పోస్టు ఖాళీ అయి దాదాపు ఏడాది గడుస్తోంది. పార్వతీపురం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టు కూడా కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఎన్నికల ముందే డీఆర్‌డీఏ పీడీకి బదిలీ అయినా.. ఇంతవరకు ఆ పోస్టులో ఎవర్నీ నియమించలేదు.

త్వరలో మరికొన్ని...

జిల్లాలో మరికొన్ని పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. ఆయా పోస్టుల్లో ఉన్న అధికారులు వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖాధికారి కృష్ణాజీ, డీపీవో బి.సత్యనారాయణ ఆగస్టులో పదవీ విరమణ చేయబోతున్నారు. ఇంజనీరింగ్‌ సెక్షన్‌తో పాటు పంచాయతీల పర్యవేక్షణ విభాగంలో పలు పోస్టులు ఖాళీ కానున్నాయి. అయితే వారి స్థానంలో వెంటనే కొత్తవారిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పాలన గడితప్పే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. దీనిపై నూతన సర్కారు స్పందించాల్సి ఉంది.

ఇష్టపడని అధికారులు...

కొంతమంది అధికారులు జిల్లాలో పనిచేసేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. ఎందుకంటే చిన్న జిల్లా కావడం, కార్యాలయాలకు పూర్తిస్థాయిలో భవనాలు, మౌలిక వసతులు లేకపోవడమేనని తెలుస్తోంది. అందుకే చాలామంది అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేసేందుకు విముఖత చూపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో విధులు నిర్వహించేందుకు కూడా అధికారులు ఇష్టపడడం లేదని కొన్నిశాఖల ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని కీలక శాఖలో పోస్టుల భర్తీపై టీడీపీ కూటమి సర్కారు దృష్టి సారించాల్సి ఉంది. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా.. మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మన్యం వాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:11 PM