నిర్ణయం గ్రామస్థులదే
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:18 AM
ఉపాధి పనుల ఎంపిక విషయంలో గ్రామస్థులదే తుది నిర్ణయమని, గ్రామ, ప్రజావసరాల మేరకు పనులు చేపట్టాలని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక విషయమై శుక్రవారం దుప్పాడలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నిర్ణయం గ్రామస్థులదే
ఎంపిక చేసిన పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలి
దుప్పాడ గ్రామ సభలో కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం రూరల్/ గంట్యాడ, ఆగస్టు 23: ఉపాధి పనుల ఎంపిక విషయంలో గ్రామస్థులదే తుది నిర్ణయమని, గ్రామ, ప్రజావసరాల మేరకు పనులు చేపట్టాలని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక విషయమై శుక్రవారం దుప్పాడలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2006 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతున్నాయన్నారు. ఎన్నో వేల కోట్ల విలువైన పనులు చేపట్టారని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ఎంపిక చేసేందుకు గ్రామసభలు నిర్వహించడం హర్షణీయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు ఎంపిక చేసుకుని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. అన్ని గ్రామాలను స్వర్ణ గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఉపాధి పనుల విషయంలో గ్రామ సభలదే నిర్ణయాధికారమన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రాజా, మండల ప్రత్యేకాధికారి అరుణకుమారి, ఎంపీడీవో గంటా వెంకటరావు, ఈఓపీఆర్‌డీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో, సర్పంచ్ లక్ష్మీ, ఎంపీటీసీ కృష్ణవేణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, జనసేన పార్టీ నాయకురాలు పాలవలస యశస్విని, టీడీపీ నాయకుడు గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిపై మీరే చర్చించుకోవాలి: కలెక్టర్
గ్రామంలోని ప్రతి ఇంటికీ కనీస అవసరాలు తీర్చడం, సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ద్వారా స్వర్ణగ్రామాలగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. మండలంలోని పెదవేమలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలోనూ కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ అవసరాలు ఏమిటి, ఏ పనులు గ్రామానికి ఉపయోగకరం అనే అంశాలపై చర్చించి ప్రజలంతా కలిసి సమష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ పెడతామని, అందరూ హాజరై వ్యక్తిగత, ఇంటి అవసరాలు, గ్రామ అభివృద్ధిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామంలోని సచివాలయం, రైతు సేవా కేంద్రం భవనాలను వెంటనే పూర్తిచేయాలని గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్‌తోపాటు మాజీ ఎంపీటీసీ బంగారయ్య కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.పాపునాయుడు, ఎంపీటీసీ భవాని, గ్రామ పెద్దలు కశిరెడ్డి పాపు నాయుడు, జి.శ్రీనివాసరావులు పాల్గొన్నారు.