Share News

‘ఉత్కంఠ’ నగరం!

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:01 AM

అభ్యర్థుల ఎంపికలోనూ... విజయావకాశాల్లోనూ... ప్రతిసారీ ఉత్కంఠకు గురిచేసే నియోజకవర్గం ఏదంటే... ఠక్కున గుర్తుకు వచ్చే పేరు గజపతినగరం.

‘ఉత్కంఠ’ నగరం!
గజపతినగరం నియోజకవర్గం మ్యాప్‌

- టీడీపీకి ఐదుసార్లు అవకాశం

- ప్రతిసారీ తీవ్ర పోటీ

-ఇదీ గజపతినగరం ప్రత్యేకత

అభ్యర్థుల ఎంపికలోనూ... విజయావకాశాల్లోనూ... ప్రతిసారీ ఉత్కంఠకు గురిచేసే నియోజకవర్గం ఏదంటే... ఠక్కున గుర్తుకు వచ్చే పేరు గజపతినగరం. వివిధ సమీకరణాల నేపథ్యంలో అన్ని పార్టీలూ ఇక్కడి అభ్యర్థి విషయంలో చివరి వరకూ వేచి చూడడం పరిపాటి. గెలుపు విషయంలోనూ అంతే... ఫలితాలు వెలువడే వరకూ విజయం ఎవరిని వరిస్తుందనే విషయంలోనూ అటు అభ్యర్థులు.. ఇటు ఓటర్లు టెన్షన్‌ తో ఎదురు చూడాల్సిందే.

గజపతినగరం: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన గజపతినగరం అంటే సంచలనాలకు మారు పేరు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని వర్గాల వారిని ఇక్కడి ప్రజలు ఆదరించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చివరి వరకు అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడం ఇక్కడి విశేషం. నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ ఉండడంతో అటు నాయకులు... ఇటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 5 పర్యాయాలు ఆ పార్టీ అభ్యర్థులకు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. గజపతినగరం నియోజకవర్గంలో కాపు, వెలమ సామాజిక వర్గాల వారే అధికం. మొట్టమొదటిగా బొండపల్లి మండలానికి చెందిన జంపన సత్యనారాయణరాజు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందగా... ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన పడాల అరుణ మూడుసార్లు విజయం సాధించారు. కె.ఎ.నాయుడు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో గజపతినగరం నియోజకవర్గం ఆవిర్భవించింది. మొదటి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి కుసుమ గజపతిరాజు పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 1959లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా తాడ్డి సన్యాసినాయుడు పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 1962, 67లో కూడా తాడ్డి సన్యాసినాయుడు రెండు పర్యాయాలు పోటీ చేసి విజయం సాధించారు. 1972లో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పెనుమత్స సాంబశివరాజు పోటీ చేసి గెలుపొందారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా... 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంగపండు నారాయణప్పలనాయుడు రెండు పర్యాయాలు విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున జంపాన సత్యనారాయణరాజు పోటీ చేసి గెలుపొందగా... 1989, 1994, 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పడాల అరుణ మూడు పర్యాయాలు పోటీ చేసి విజయం సాధించారు. 1999లో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తాడ్డి సన్యాసి అప్పలనాయుడు అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున.. 2019లో వైసీపీ తరఫున బొత్స అప్పలనరసయ్య పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్‌, వైసీపీ అభ్యర్థిగా బొత్స అప్పలనరసయ్య, కాంగ్రెస్‌ నుంచి గాదాపు కూర్మినాయుడులు పోటీలో ఉన్నారు. ఈ పర్యాయం నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాలి.

నియోజకవర్గంలో మండలాలు

గజపతినగ రం నియోజకవర్గ పరిధిలో గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ మండలాలతో పాటు జామి మండలంలోని 15 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

ఓటర్లు ఇలా...

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,04,286

పురుషులు1,00,227

మహిళలు 1,04,054 మంది.

గజపతినగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు

1955 కుసుమ గజపతిరాజు ప్రజా సోషలిస్టు పార్టీ

1959 తాడ్డి సన్యాసినాయుడు స్వతంత్ర పార్టీ

1962 తాడ్డి సన్యాసినాయుడు స్వతంత్ర పార్టీ

1967 తాడ్డి సన్యాసినాయుడు స్వతంత్ర పార్టీ

1972 పెనుమత్ససాంబశివరాజు కాంగ్రెస్‌

1978 వంగపండు నారాయణప్పలనాయుడు జనతా

1983 జంపన సత్యనారాయణరాజు తెలుగుదేశం

1985 వంగపండు నారాయణప్పలనాయుడు కాంగ్రెస్‌

1989 పడాల అరుణ తెలుగుదేశం

1994 పడాల అరుణ తెలుగుదేశం

1999 తాడ్డి సన్యాసి అప్పలనాయుడు కాంగ్రెస్‌

2004 పడాల అరుణ తెలుగుదేశం

2009 బొత్స అప్పలనరసయ్య కాంగ్రెస్‌

2014 కొండపల్లి అప్పలనాయుడు తెలుగుదేశం

2019 బొత్స అప్పలనరసయ్య వైసీపీ

Updated Date - Apr 27 , 2024 | 12:01 AM