Share News

అంతన్నారు.. ఇంతన్నారు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:21 PM

బొబ్బిలిలో మూతపడిన జూట్‌ పరిశ్రమలను తెరిపిస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. వెంగళరాయసాగర్‌ జలాశయం నుంచి బొబ్బిలి మండలంలో అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. చిత్రకోట జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. లింకురోడ్డు.. నదులపై వంతెనలు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని అన్నారు. ఇలా జిల్లాలో పాదయాత్ర సమయంలో జగన్‌ అనేక హామీలు ఇచ్చారు. ఏవీ నెరవేరలేదు. కొన్నింటికి కనీసం అడుగు కూడా పడలేదు. ఇదేం పాలన అంటూ జిల్లా ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అంతన్నారు.. ఇంతన్నారు
మూతపడిన ఎన్‌సీఎస్‌ లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం

అంతన్నారు.. ఇంతన్నారు

పాదయాత్ర సమయంలో ఎన్నో హామీలిచ్చిన జగన్‌

వాటికి నేటికీ అతీగతీ లేకపోయె.. కుంటుపడిన అభివృద్ధి

మూతపడిన పరిశ్రమలు.. సాగునీటికి అవస్థలు

బొబ్బిలిలో మూతపడిన జూట్‌ పరిశ్రమలను తెరిపిస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. వెంగళరాయసాగర్‌ జలాశయం నుంచి బొబ్బిలి మండలంలో అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. చిత్రకోట జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. లింకురోడ్డు.. నదులపై వంతెనలు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని అన్నారు. ఇలా జిల్లాలో పాదయాత్ర సమయంలో జగన్‌ అనేక హామీలు ఇచ్చారు. ఏవీ నెరవేరలేదు. కొన్నింటికి కనీసం అడుగు కూడా పడలేదు. ఇదేం పాలన అంటూ జిల్లా ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2018 సెప్టెంబరు 24 నుంచి ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్‌ జిల్లాలో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అనేక స్థానిక సమస్యలను ప్రస్తావించారు. అధికారంలో వస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యారు కాని ఇచ్చిన మాటలను మాత్రం ఆచరణలో పెట్టలేకపోయారు. ప్రజాధనంతో ఉచితాల పంపకాల బటన్‌ నొక్కుడుతోనే సరిపెట్టారు. అభివృద్ధిని వదిలేశారు. టీడీపీ ప్రభుత్వం మంజూరుచేసి చేపట్టిన పనులపై కనీసం దృష్టి పెట్టలేదు. పరిశ్రమలు లేవు. యువతకు ఉపాధి లేదు. ఉద్యోగ అవకాశాలు లేవు. ఐదేళ్లుగా ఇదే పోకడను కొనసాగించి అభివృద్ధిని కుంటుపడేలా చేశారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామం వద్ద 2018 సెప్టెంబరు 24న జిల్లా పరిధిలో పాదయాత్ర ప్రారంభించారు. నవంబరు 22న గరుగుబిల్లి మండలం రావివలస వద్ద పాదయాత్ర ముగిసే వరకు అనేక హామీలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చినపుడు ఇచ్చిన హామీలు సైతం మరిచారు.

ఉన్న పరిశ్రమలు సైతం మూత

బొబ్బిలి సమీపంలోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకు అంత్యంత కీలకం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కార్మాగారాన్ని మూత వేయించారు. ఎన్‌సీఎస్‌కు చెందిన ఈ చక్కెర కార్మాగారం నిలిపేయడంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుతో ఎన్‌సీఎస్‌ భూములను సైతం అమ్మకం చేశారు. దీని వెనుక జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కీ రోల్‌ వహించారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత చేసినా ఇంకా రైతుల బకాయిలు రూ.6 కోట్లు ఉంది. భూముల అమ్మకం ద్వారా రూ.16.84 కోట్లు చెల్లించారు. 320 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

- బొబ్బిలి జూట్‌ పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇక్కడ మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. వీటిని తెరిపించలేదు సరికదా మొత్తంగా ఆయా స్థలాలు అమ్మకాలైపోయాయి. ఇందుకు ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సహకారం అందించారని సమాచారం. కార్మికుల సమస్యల పరిష్కారం కోసమేనంటూ తమ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఇలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మూత పడ్డాయి.

సాగునీటిదీ అదే తీరు

ఎమ్మెల్యే శంబంగి తన చిరకాల ఆశయంగా ప్రకటించిన ఎత్తిపోతల పథకాలను కూడా మంజూరు చేయించుకోలేక పోయారు. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ పరిధిలోని రామన్నదొరవలస వద్ద రెండు ఎత్తిపోతల పథకాలకు అంచనాలు తయారు చేసి పంపించారు. అసెంబ్లీలో సైతం ప్రస్తావించినా ఈ ప్రతిపాదనలను జగన్‌ ఖాతరు చేయలేదు. మక్కువ మండలంలో సువర్ణముఖి, గోముఖి నదుల అనుసంధానంతో వెంగళరాయసాగర్‌ జలాశయం ఉంది. దీని నుంచి బొబ్బిలి మండలంలో అదనంగా 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రతిపాదనలు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం నుంచీ ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చి పూర్తి చేస్తామని జగన్‌ ప్రకటించారు. దాని ఊసే లేదు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నా పరిష్కారం కాని కంచరిగెడ్డ చిత్రకోట జలాశయాన్ని పూర్తి చేస్తామని జగన్‌ ప్రకటించారు. ఇది కూడా నెరవేరలేదు.

వంతెనలు కూలినా..

అంతర్‌ రాష్ట్ర రోడ్డులో వంతెన కూలి ట్రాఫిక్‌ నిలిచిపోయిన దారుణ పరిణామం ఈ ప్రభుత్వ పాలనలోనే జరిగింది. పాదయాత్రలో భాగంగా లింకురోడ్డు.. నదులపై వంతెనలు పూర్తి చేస్తామని ఒక వైపు జగన్‌, మరోవైపు ఎమ్మెల్యే హామీలు కురిపించారు. ఏదీ జరగలేదు. భోజరాజపురం-కొత్తపెంట గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వేగావతి నదిపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. నిధులు విదల్చని కారణంగా పనులు చేపట్టలేదు. కోమటిపల్లి-కింతలవానిపేట మధ్య ప్రవహిస్తున్న సువర్ణముఖీ నదిపై వంతెన నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి అతీగతీ లేదు. నియోజకవర్గంలో లింకు రోడ్డు మొత్తం పూర్తిచేస్తామని ప్రకటించినా అమలు అంతంతమాత్రమే.

- బొబ్బిలి-పార్వతీపురం నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని రాయగడ జిల్లాకు వెళ్లే అంతర్‌ రాష్ట్ర రోడ్డు మార్గం ఉంది. ఈ మార్గంలో వేగావతి నదిపై పారాది వద్ద బ్రిటీష్‌ కాలం నాటి వంతెన ఉంది. దీని స్థానంలో నూతన వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాత వంతెన ఒక వైపు కూలిపోయి వాహనాలను అనుమతించడం లేదు. ట్రాఫిక్‌కు తీవ్ర స్థాయిలో నిలిచిపోయింది. అలాగే సీతానగరం వద్ద సువర్ణముఖీ నదిపై వంతెన నిర్మాణ పనులు రూ.11 కోట్లుతో జరుగుతున్నాయి. అయితే బిల్లులు సక్రమంగా చెల్లించని కారణంగా పనులు ఏడాది క్రితం నిలిచిపోయాయి.

ప్రభుత్వ జూనియర్‌.. డిగ్రీ కళాశాల ఏవీ

బొబ్బిలి ప్రాంతంలో అంతా ప్రైవేట్‌ విద్యపైనే ఆధారం. ఇతర మండల కేంద్రాల్లో సైతం ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాలలున్నాయి. బొబ్బిలి వాసులకు మాత్రం ప్రభుత్వ కళాశాల విద్య ఓ కలగా మిగిలింది. ఈ పరిస్థితిలో బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని జగన్‌ ప్రకటించారు. నేటికీ ఈ హామీ నెరవేరలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఈ హామీని 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంటారేమోనని పట్టణ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:21 PM