Share News

బైక్‌పై కన్నేశాడంటే అంతే

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:15 AM

పార్కింగ్‌లో ఉన్న బైక్‌లను కొద్దిసేపు జాగ్రత్తగా గమనిస్తాడు.. ఎవరూ రాకుంటే చాకచక్యంగా తాళం తెరిచి పట్టుకుపోతాడు. ఈ విధంగా 12 బైక్‌లను తీసుకుపోయి చోర కళలో ఆరితేరిపోయాడు.

బైక్‌పై కన్నేశాడంటే అంతే
స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్లతో డీఎస్పీ గోవిందరావు

బైక్‌పై కన్నేశాడంటే అంతే

12 మోటారు సైకిళ్లు చోరీ

నిందితునిపై నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు

విజయనగరం క్రైం, జనవరి 29: పార్కింగ్‌లో ఉన్న బైక్‌లను కొద్దిసేపు జాగ్రత్తగా గమనిస్తాడు.. ఎవరూ రాకుంటే చాకచక్యంగా తాళం తెరిచి పట్టుకుపోతాడు. ఈ విధంగా 12 బైక్‌లను తీసుకుపోయి చోర కళలో ఆరితేరిపోయాడు. పోలీసులు నిఘా పెట్టడంతో అడ్డంగా దొరికిపోయాడు. అంతర్‌ జిల్లాల మోటారు సైకిళ్ల దొంగను విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ గోవిందరావు ఆ వివరాలను తెలియజేశారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామానికి చెందిన దుప్పాడ దుర్గాప్రసాద్‌ విజయనగరం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీసుస్టేషన్‌తో పాటు పూసపాటిరేగ, భోగాపురం పోలీసుస్టేషన్ల పరిధిలో మోటారు సైకిళ్లు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అన్నిచోట్లా కేసులు నమోదయ్యాయి. ఎస్పీ ఆదేశాలతో బైక్‌ చోరీ కేసులపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. వన్‌టౌన్‌ సీఐ బి.వెంకటరావు, సిబ్బంది పాత నేరస్థులపై ఆరా తీయడంతో పాటు జిల్లా కేంద్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా దుర్గాప్రసాద్‌ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి 12 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖపట్టణం సిటీ పరిధిలో కూడా దొంగతనాలకు పాల్పడినట్టు డీఎస్పీ గోవిందరావు తెలిపారు. విలేకరుల సమావేశంలో ట్రైనీ ఎస్పీ, సీఐ వెంకటరావు, ఎస్‌ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:15 AM