Share News

రెండో రోజు పది నామినేషన్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:32 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పది నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇప్పటివరకు శాసనసభ నియోజకవర్గాలకు ఏడు, అరకు పార్లమెంట్‌కు నాలుగు నామినేషన్లు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు.

రెండో రోజు పది నామినేషన్లు
పార్వతీపురంలో ఆర్వో హేమలతకు నామినేషన్‌ పత్రాలను అందిస్తున్న టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర

పార్వతీపురం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి)/సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పది నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇప్పటివరకు శాసనసభ నియోజకవర్గాలకు ఏడు, అరకు పార్లమెంట్‌కు నాలుగు నామినేషన్లు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు. కాగా రెండో రోజు పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర, స్వతంత్ర అభ్యర్థిగా గర్భాపు ఉదయ్‌భాను ఒక్కో సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నిగ్‌ అధికారి కె.హేమలతకు అందించారు. పాలకొండ వైసీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను సీతంపేట ఐటీడీఏలో ఆర్వో కల్పనాకుమారికి అందజేశారు. సాలూరులో టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణుచరణ్‌కు అందించారు. వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర కూడా ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కురుపాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వి.వెంకటరమణకు అందజేశారు. ఇక అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులుగా నిమ్మక జయరాజు, పాలక రంజిత్‌కుమార్‌, సీపీఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనరసయ్య , వైసీపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి తరపున ఆమె ప్రతినిధి ఒక్కో సెట్‌ నామినేషన్‌ పత్రాలను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు అందించారు. ఈ నెల 24, 25 తేదీల్లోనూ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు మళ్లీ నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నట్లు తెలిసింది. కాగా ఎక్కడా అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

మందుబాబుల హడావిడి

జియ్యమ్మవలస: నామినేషన్ల దాఖల సందర్భంగా అంతటా మందుబాబుల హడావుడి కనిపించింది. శుక్రవారం కురుపాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు మద్యం షాపుల ముందు బారులుతీరారు. గ్రామంలో ఏ చెట్ల కింద చూసినా వారే కనిపించారు. ఆ ప్రాంతాల్లోనే వారంతా మద్యం తాగుతూ సేద తీరారు.

గంటలోనే లక్ష్యం పూర్తి

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో నామినేషన్‌ దాఖలుకు శుక్రవారం నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. అయితే వారిలో చాలా మంది మద్యాన్ని తాగేందుకు ఆసక్తి చూపారు. ఇంకేమంది స్థానికంగా ఉన్న రెండు మద్యం షాపుల వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకే ఆయా మద్యం షాపులు రోజువారీ విక్రయాల లక్ష్యం పూర్తయింది. దీంతో వెంటనే షాపులను మూసివేశారు. అయితే సాయంత్రం మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు నిరాశ చెందారు.

Updated Date - Apr 19 , 2024 | 11:32 PM