Share News

ప్రలోభాలు.. బెదిరింపులు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:46 PM

‘మీకు మంచి జరిగిందనిపిస్తే.. వైసీపీకి ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మరోవైపుగా వలంటీర్లను పావులుగా వాడుకుంటున్నారు. రాజకీయాలకు వారిని బలిచేస్తున్నారు. వలంటీర్లకు ఉన్న పరిచయాలతో ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు యోచిస్తున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రలోభాలు.. బెదిరింపులు

తమకు అనుకూలంగా పనిచేయాలంటున్న అధికార పార్టీ నేతలు

తాయిలాలతో మచ్చికకు యత్నం.. వినకుంటే హెచ్చరికలు

వాటికి దూరంగా కొందరు వలంటీర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు భరోసాపై అంతర్గతంగా చర్చ

కూటమి ప్రభుత్వం వస్తే ఉత్తమ భవిష్యత్‌ ఉంటుందని ఆశాభావం

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

‘మీకు మంచి జరిగిందనిపిస్తే.. వైసీపీకి ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మరోవైపుగా వలంటీర్లను పావులుగా వాడుకుంటున్నారు. రాజకీయాలకు వారిని బలిచేస్తున్నారు. వలంటీర్లకు ఉన్న పరిచయాలతో ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు యోచిస్తున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాయిలాలు, ప్రలోభాలతో బరితెగిస్తున్నారు. రాజీనామాలు చేసి వైసీపీకి సేవలు చేయాలని వంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారు. తామే పోస్టులు వేశాం, చెప్పినట్టు రాజీనామా చేయాలంటున్నారు. దీంతో కొందరు వలంటీర్లు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. తమను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయొద్దని చాలా మంది వలంటీర్లు విన్నవించుకుంటున్నారు. అయినా సరే కొందరు వైసీపీ నేతలు వినడం లేదు. దుస్తులు, డబ్బులు తదితర తాయిలా లతో వలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వాటికి కొందరు వలంటీర్లు దూరంగా ఉంటున్నారు. వైసీపీ కార్యకర్తల్లాంటి వలంటీర్లు మినహా మిగిలిన వారంతా వలంటీరు పోస్టులను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వలంటీర్లకు భవిష్యత్‌ ఉండకపోవచ్చుననేది వారి భావన. ప్రజావాణి చూస్తే ప్రభుత్వంపై సానుకూలత లేదని, భవిష్యత్‌లో మేలు జరుగుతుందని అనుకోలేమని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామా చేసి.. జగనన్నకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే.. వలంటీర్లగా తిరిగి నియమిస్తామని చెబుతున్నారు. అప్పటికీ వినకుంటే వారి కుటుంబ సభ్యులు, బంధువులతో చెప్పిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తోచక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ చెప్పినట్లు చేయాలా? లేక మిన్నకుండి పోవాలా? అని కొందరు మథనపడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తమకేమైనా పార్టీ నిఽధుల నుంచి వేత నాలు ఇచ్చిందా? ఆ పార్టీ కోసం తమ భవిష్యత్తును చేసుకోవాల్సిన అవసరం ఏమిటని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో సుమారు 5,200 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వీరిలో కేవలం 11 మంది ఈ నెల 5న వీరఘట్టం మండలం చిదిమి గ్రామం నుంచి రాజీనామా చేస్తున్నట్టు ఎంపీడీవోకు లేఖలు అందించారు. ఈ లేఖలు జిల్లా అధికారులకు చేరాయి. వారు మినహా జిల్లాలో ఎక్కడ కూడా వలంటీర్లు రాజీనామా చేయలేదు. మరోవైపు వైసీపీ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో జిల్లాలో సుమారు 13 మంది వలంటీర్లను అధికారులు విధుల నుంచి తొల గించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో కొందరు వలంటీర్లు జాగ్రత్తగా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పార్వతీపురం మండలంలో అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో కొందరు వలంటీర్లు దివ్యాంగుల అనుమతులు లేకుండా వారి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులు స్వీకరించారు. దీంతో అధికారులు దర్యాప్తు నిర్వహించి ఆయా వలంటీర్లను విధుల నుంచి తొలగించారు. పార్వతీపురం నియోజకవర్గం చిన్నబొండపల్లి గ్రామంలో ఇదే అంశంపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. రేపు..మాపో.. రాష్ట్ర , కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లనున్నాయి. ఇటువంటి ఫిర్యాదులు అక్కడి వరకు వెళ్తే.. పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో జిల్లాలో కొందరు వలంటీర్లు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. వైసీపీ నేతలు చెప్పిందల్లా చేస్తే.. ఎటువంటి కష్టాలు ఎదురవుతాయోనని మరికొందరు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొత్తంగా జిల్లాలోని అనేక మంది వలంటీర్లు రాజీనామా చేసేందుకు ఇష్టపడడం లేదు.

చంద్రబాబు భరోసాతో..

వలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ సొమ్ముతో గౌరవ వేతనం పొందుతున్న వారు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే.. వలంటీర్ల విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జిల్లాలో అనేకమంది వలంటీర్లు వైసీపీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే తమకు బంగారు భవిష్యత్‌ ఉంటుందని విద్యావంతులైన వలంటీర్లు భావిస్తున్నారు. ఇటువంటి వారంతా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:46 PM