Share News

టీచర్‌ టు మినిస్టర్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:42 PM

టీచర్‌ నుంచి మినిస్టర్‌గా ఎదిగి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు

 టీచర్‌ టు మినిస్టర్‌
రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంధ్యారాణి

1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ

2009లో టీడీపీలో చేరిక..

రెండుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీగా ఓటమి

వైసీపీ ప్రలోభాలు, బెదిరింపులు తలొగ్గని వైనం

ఎమ్మెల్సీగా, పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా సేవలు

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కైవసం

సాలూరు రూరల్‌: టీచర్‌ నుంచి మినిస్టర్‌గా ఎదిగి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి అరకు ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. అయినా నిరుత్సాహక పడక.. పట్టుసడలని దీక్షతో 2024 ఎన్నికల బరిలో దిగి అఖండ విజయన్ని దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. మొత్తంగా ఉపాధ్యాయురాలుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన గుమ్మిడి సంధ్యారాణి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తన చిరకాల వాంఛ అయిన రాష్ట్రమంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.

- మక్కువ మండలం కవిరిపల్లిలో మార్చి 15, 1974లో జన్ని ముత్యాలు, పార్వతమ్మలకు ఆమె జన్మించారు. వియనగరం ఎంఆర్‌ కాలేజ్‌లో బీఎస్సీ చదివారు. విజయనగరంలో టీటీసీ చదివిన ఆమె గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆమె మెట్టిన ఇల్లు సాలూరు నియోజకవర్గంలో మెంటాడ మండలం లింగాలవలస. ఆమె భర్త జయకుమార్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీరు. ఆమెకు కుమారుడు పృథ్వీ, కుమార్తె ప్రణతి ఉన్నారు. ఆమె తండ్రి జన్ని ముత్యాలు సైతం 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సాలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకుని ఆమె రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా విజయం సాధించిన తొలిసారే రాష్ట్రమంత్రిగా అయ్యారు. ఆమె 2015 నుంచి 2021 వరకు టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేయడం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యిన మంత్రి పదవి రావడానికి దోహదపడింది.

- తొలిసారిగా 1999లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సాలూరు అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి ఆర్పీభంజ్‌దేవ్‌పై ఓటమి చవిచూశారు. అనంతరం 2004లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో 2005 నుంచి 2007 వరకు స్త్రీ శిశు సంక్షేమశాఖ విశాఖ రీజియన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఎస్సీఎస్టీ కమిషన్‌ సభ్యురాలుగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ లభించలేదు. దీంతో ఆమె 2009లో తెలుగుదేశంలో చేరిన తర్వాత సాలూరు టిక్కెట్‌ సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో 1,656 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2014లో టీడీపీ సాలూరు అసెంబ్లీ టిక్కెట్‌ దక్కలేదు. టీడీపీ అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పొందారు. అయితే 2015లో ఆమె ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో సైతం ఆమెకు టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు. 2020 నుంచి 2023 వరకు టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలుగా కొన్నాళ్లు పనిచేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా ప్రస్తుతం ఉన్నారు. 2024 ఎన్నికల్లో సాలూరు వైసీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరపై ఆమె భారీ విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఫలించిన కల

పార్వతీపురం, జూన్‌12 (ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్‌: కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. మంత్రులుగా మరో 23 మంది ప్రమాణం చేయగా.. వారిలో సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి కూడా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి ఆమె గెలుపొందారు. సాలూరు నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె ‘గుమ్మిడి సంధ్యారాణి అనే నేను..’ అంటూ రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు. టీవీల్లో ఈ దృశ్యం చూసిన సాలూరు నియోజకవర్గ వాసులు ఆనందంతో ఉప్పొంగి పోయారు. టీడీపీకి చెందిన సాలూరు శ్రేణులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో విజయవాడకు తరలివెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ ప్రలోభాలకు తలొగ్గక..

సాలూరు రూరల్‌: సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి కష్టకాలంలో టీడీపీ పార్టీపై విధేయతతో పనిచేయడమే మంత్రి పదవి తెచ్చిపెట్టిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్సీలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ నిర్వహించింది. వైసీపీ ఆమెకు పెద్దఎత్తున ప్రలోభపెట్టినా.. టీడీపీ లైన్‌కే కట్టుబడి ఉన్నారు. వైసీపీ ఎంత ఒత్తిడి తెచ్చిన పార్టీ మారలేదు. పైగా వైసీపీని ఎదుర్కోవడంతో పోరాటపటిమను చూపారు. దీనిని గుర్తించిన టీడీపీ అధిష్ఠానం ఆమెకు సాలూరు ఇన్‌చార్జిగా పదవి కట్టబెట్టింది. దీంతో సాలూరులో టీడీపీ బలోపేతానికి ఆమె మరింతగా కృషి చేశారు. 2024లో సరికొత్త ఎన్నికల ఎత్తుగడలతో విజయం సాధించారు. పార్టీకి ఆమె చూపిన విధేయత, ఎస్టీ సామాజిక వర్గం కావడంతో సామాజిక న్యాయం సూత్రం మేరకు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు మంత్రి పదవిని పార్టీ ఇచ్చింది.

మంత్రుల సమావేశానికి హాజరు...

సాలూరు రూరల్‌: సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో బుధవారం సాయంత్రం జరిగిన రాష్ట్రమంత్రుల సమావేశానికి రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు పలు సూచనలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రులు కట్టుబడి ఉండాలని ఆదేశించారు.

సాలూరుకు మూడోసారి మంత్రి పదవి

పార్వతీపురం, జూన్‌12 (ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్‌ : సాలూరు నియోజకవర్గానికి మూడోసారి రాష్ట్రమంత్రి వర్గంలో చోటు లభించింది. ప్రస్తుతం చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి చోటు దక్కింది. ఆమె బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1985లో సాలూరు నుంచి బోయిన రాజయ్య టీడీపీ ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 ఏప్రిల్‌ నుంచి ఈ నెల 4 వరకు సాలూరు నుంచి పీడిక రాజన్నదొర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సాలూరు నుంచి రాష్ట్రమంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి పదవి లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలోను, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వరుసగా సాలూరుకు మంత్రి రావడం విశేషం. కాగా గుమ్మిడి సంధ్యారాణికి గిరిజన సంక్షేమశాఖ లభించవచ్చునని పలువురు భావిస్తున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:42 PM