Share News

అందరికీ అండగా టీడీపీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:20 AM

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటనకు విశేష స్పందన లభించింది. ‘నిజం గెలివాలి’ పాదయాత్రలో భాగంగా తొలిసారి జిల్లాకు వచ్చిన ఆమెకు టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అందరికీ అండగా టీడీపీ
బిల్లుమడలో ప్రజలకు అభివాదం చేస్తున్న నారా భువనేశ్వరి

జిల్లాలో పర్యటన విజయవంతం

అడుగడుగునా ప్రజల నీరాజనం

బాధిత కుటుంబానికి పరామర్శ

ఆర్థిక సాయం అందజేత

పార్వతీపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి)/పాలకొండ/భామిని: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటనకు విశేష స్పందన లభించింది. ‘నిజం గెలివాలి’ పాదయాత్రలో భాగంగా తొలిసారి జిల్లాకు వచ్చిన ఆమెకు టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. గురువారం ఆమె పాలకొండలోని కోటదుర్గ గుడి నుంచి సీతంపేట, కొత్తూరు మండలాల మీదుగా భామిని మండలం బిల్లుమడ గ్రామానికి చేరుకున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు కలత చెంది ఆ గ్రామానికి చెందిన బర్రి విశ్వనాఽథం మరణించారు. ఈ మేరకు విశ్వనాఽథం భార్య వనజాక్షి, పిల్లలు గౌతమ్‌, శివశంకర్‌లను భువనేశ్వరి ఓదార్చారు. విశ్వనాథం టీడీపీ వీరాభిమాని అని వనజాక్షి కన్నీరు పెట్టుకొని చెప్పారు. ఆమెను భువనేశ్వరి ఓదార్చుతూ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.మూడు లక్షల చెక్కును వనజాక్షికి అందించారు.

ఘన స్వాగతం..

పాలకొండలో నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు. ముందుగా ఆమె కోటదుర్గతల్లి ఆలయానికి చేరుకొని అక్కడ నుంచి భామిని బయల్దేరి వెళ్లారు. పాలకొండ నుంచి అడుగుడుగునా మహిళలు భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. సీతంపేటలో పార్టీ మండల అధ్యక్షుడు సవరతోట ముఖలింగం ఆధ్వర్యంలో సుమారు 1500 మంది గిరిజనులు నారా భువ నేశ్వరికి ఆహ్వానం పలుకుతూ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు అటవీ ఉత్పత్తులను భువనేశ్వరికి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె గిరిజనులతో మమేకమయ్యారు. టీడీపీ అండగా ఉంటుందని చెబుతూ.. ప్రతి ఒక్కర్నీ అభినందిస్తూ ముందుకుసాగారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తామని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని గిరిజనులు నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో భువనేశ్వరికి స్వాగతం పలికారు. పాలకొండ నియోజకవర్గ పరిశీలకుడు కలమట సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

పసుపుమయమైన బిల్లుమడ

భామిని మండలం బిల్లుమడ గురువారం పసుపుమయమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆ గ్రామం కిటకిటలాడింది. పాలకొండ నియో జకవర్గ పరిధిలో ఉన్న భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు. ‘చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి .. జై తెలుగుదేశం’ అంటూ వారంతా నినాదాలు చేశారు. ప్రజలకు నారా భువనేశ్వరి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆమె వెంట టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకటరావు, గుమ్మిడి సంధ్యారాణి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ అనూరాధ, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

రక్షణ దళంగా నిలిచి..

‘నిజం గెలవాలి’ పాదయాత్రలో భాగంగా నారా భువనేశ్వరి తొలుత పాలకొండలో కోటదుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చేరుకోవడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. అక్కడ పోలీసులు అంతంతమాత్రంగానే కనిపించారు. అయితే ‘నిజం గెలవాలి’ వలంటీర్లు రోప్‌ పార్టీగా ఏర్పడి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చూశారు. భువనేశ్వరికి రక్షణ దళంగా నిలిచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మొత్తంగా జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేశాయి.

శ్రేణుల్లో నూతనోత్సాహం

సీతంపేట: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి సీతంపేటను సందర్శించడం, ప్రజల ఆదరణ, స్పందన చూసిన కార్యకర్తలు, నేతల్లో నూతనోత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు చెప్పారు. నాడు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా లోకేష్‌ సీతంపేట సందర్శించి.. మన్యంలో రహదారుల అభివృద్ధి, టూరిజం వంటి వాటికి అధిక ప్రాధాన్యం కల్పించారని కార్యకర్తలు భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు పవన్‌కుమార్‌, బిడ్డిక దమయంతినాయుడు, సవర మాలయ్య, ఆరిక లక్షుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:20 AM