Share News

డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:57 PM

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మరింత గడువు చిక్కనుంది.

డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు

హైకోర్టు తీర్పుతో రీ షెడ్యూల్‌కు అవకాశం

సాలూరు రూరల్‌,మార్చి 4: ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మరింత గడువు చిక్కనుంది. టెట్‌, డీఎస్సీ (టీఆర్‌టీ) మధ్య కేవలం ఒక్కరోజు గడువు ఉండడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో టెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత నాలుగు వారాల గడువుతో డీఎస్సీ నిర్వహించాలని, కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే అది రావొచ్చని పలువురు భావిస్తున్నారు. వాస్తవంగా గతనెల 8, 12న, టెట్‌, డీఎస్సీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. గత నెల 18 వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించగా.. ఫిబ్రవరి 27 నుంచి టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 వరకు ఆ పరీక్షలు జరగనున్నాయి. టెట్‌ ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. డీఎస్సీకి గత నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే టెట్‌ ఫలితాలు వెలువడిన వెంటనే ఈ నెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలను నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీలు 103, పాఠశాల సహాయకులు 97, టీజీటీ 84 మొత్తంగా 284 ఉపాధ్యాయ ఖాళీలను చూపించారు. వీటికి వేలాదిగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రిపరేషన్‌( సన్నద్ధం )కు సమయం చాలకపోవడం తీవ్ర ఒత్తిడి లోనయ్యారు.

Updated Date - Mar 04 , 2024 | 11:57 PM