Share News

గెడ్డను మింగేస్తున్నారు!

ABN , Publish Date - May 22 , 2024 | 11:24 PM

జిల్లా కేంద్రం గుండా వెళ్తున్న వరహాల గెడ్డ పరివాహక ప్రాంతంపై ఆక్రమణదారుల కళ్లు పడ్డాయి. గత కొన్నేళ్లుగా గెడ్డ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఇళ్లు, పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తున్నారు.

  గెడ్డను మింగేస్తున్నారు!

- యథేచ్ఛగా వరహాల గెడ్డ ఆక్రమణ

- పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి భవనాలు కడుతున్న వైనం

- వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న లోతట్టు కాలనీలు

- చోద్యం చూస్తున్న అధికారులు

పార్వతీపురంటౌన్‌, మే 22: జిల్లా కేంద్రం గుండా వెళ్తున్న వరహాల గెడ్డ పరివాహక ప్రాంతంపై ఆక్రమణదారుల కళ్లు పడ్డాయి. గత కొన్నేళ్లుగా గెడ్డ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఇళ్లు, పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ వ్యాపారి పార్వతీపురం ప్రధాన రహదారిలోని వరహాల గెడ్డ గట్టుని ఆక్రమించి భవన నిర్మాణానికి ప్రయత్నించాడు. అప్పట్లో ప్రజా సంఘాలు, కొత్తమంది ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, అడపదడపా అధికారులు కళ్లు కప్పి ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆగని ఆక్రమణలు

వైసీపీ ఐదేళ్ల పాలనలో చెరువులు, గెడ్డలు, వాగులు ఆక్రమణకు గురైనట్లు చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే వరహాల గెడ్డ పరివాహక ప్రాంతం 50 శాతానికి పైగా ఆక్రమణకు గురైంది. ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా భవనా లను నిర్మిస్తోన్నారు. మరో వైపు గెడ్డ పరివాహక ప్రాంతం అన్యాక్రాంతం అవుతుంది. ఇలా గెడ్డలు, వాగులు, చెరువులు ఆక్రమణకు గురైతే భవిష్యత్‌లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో జిల్లా కేంద్రవాసులకు కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వరహాల గెడ్డ ఆక్రమణలపై స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు.

ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు..

ఆక్రమణలతో వరహాల గెడ్డ రోజురోజుకూ కుచించుకుపోతుంది. ఫలితంగా భారీ వర్షాల సమయంలో గెడ్డలోకి నీరు వెళ్లే మార్గం తక్కువై సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చేస్తుండడంతో ముంపునకు గురవుతున్నాయి. ప్రతి ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు మధ్యలో కురిసే వర్షాలకు వరహాల గెడ్డ పరివాహక ప్రాంతంలోని సౌందర్య థియేటర్‌ వీధి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని గణేష్‌ కాలనీ, బైపాస్‌ కాలనీ ముంపు బారిన పడుతున్నాయి. అయినా మునిసిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తుంది.

చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తాం

జిల్లా కేంద్రంలో చెరువులు, గెడ్డలు, కాలువ గట్టులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పెద్దలు చేస్తే ఒప్పు.. పేదలు చేస్తే తప్పు అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. వరహాల గెడ్డను కబ్జా చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తుండడం బాధాకరం. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పోరాటాలను ఉధృతం చేస్తాం.

-వి.దాలినాయుడు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు.

నిర్లక్ష్యం తగదు..

అధికార పార్టీ అండదండలతో వరహాల గెడ్డ పరివాహక ప్రాంతంతో పాటు పట్టణంలోని చెరువులు, కాలువలను కొందరు ప్రముఖులు ఆక్రమిస్తున్నారు. అయినా రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. వరహాల గెడ్డ ఆక్రమణతో ప్రతి ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. అధికారులకు తెలిసినప్పటికీ ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు.

-ఎస్‌. భాస్కరరావు, ఉత్తరాంరఽధ చెరువుల పరిరక్షణ సమితి పట్టణ అఽధ్యక్షుడు, పార్వతీపురం.

చర్యలు తీసుకుంటాం

వరహాల గెడ్డ పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురవుతున్నట్లు కొంతమంది నుంచి ఫిర్యాదు అందింది. పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమగ్ర నివేదికను ఇస్తారు. ఆక్రమణలు నిజమైతే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.

-కె.శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

Updated Date - May 22 , 2024 | 11:24 PM