Share News

కూటమికి ‘సూపర్‌’ సపోర్టు

ABN , Publish Date - May 12 , 2024 | 12:03 AM

టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్‌-6 పథకాలు ప్రజలను ఆలోచింప జేస్తున్నాయి. ప్రతిచోటా వాటిపైనే చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆరు పథకాలతో ఆంధ్ర ప్రజల అభివృద్ధి ముడి పడి ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ పల్లెలో చూసినా, పట్టణాల్లో పరిశీలించినా సూపర్‌-6కు భలే సపోర్టు లభిస్తోంది. అన్ని వర్గాలు జై పలుకుతున్నాయి. వైసీపీ మ్యానిఫెస్టోలోని అంశాలన్నీ పాతవే కావడంతో కొత్తదనం లేదని ఖరాఖండి చెప్పేస్తున్నారు.

కూటమికి ‘సూపర్‌’ సపోర్టు

కూటమికి ‘సూపర్‌’ సపోర్టు

ప్రజల్లోకి బలంగా వెళ్లిన ఎన్నికల హామీలు

ఎక్కడ చూసినా వాటిపైనే చర్చ

వైసీపీ ఎన్నికల హామీల్లో కొత్తదనం శూన్యం

టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్‌-6 పథకాలు ప్రజలను ఆలోచింప జేస్తున్నాయి. ప్రతిచోటా వాటిపైనే చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆరు పథకాలతో ఆంధ్ర ప్రజల అభివృద్ధి ముడి పడి ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ పల్లెలో చూసినా, పట్టణాల్లో పరిశీలించినా సూపర్‌-6కు భలే సపోర్టు లభిస్తోంది. అన్ని వర్గాలు జై పలుకుతున్నాయి. వైసీపీ మ్యానిఫెస్టోలోని అంశాలన్నీ పాతవే కావడంతో కొత్తదనం లేదని ఖరాఖండి చెప్పేస్తున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

- కూటమి ప్రభుత్వం వస్తే ఏకంగా గడిచి పోయిన నెలల నుంచే పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. జూలై నెలలో ఏప్రిల్‌, మే, జూన్‌ బకాయిలు రూ.3వేలు, జూలై పింఛను రూ.4వేలు కలిపి ఒకేసారి రూ.7వేలు అందిస్తామని పేర్కొన్నారు. అది కూడా ఇళ్ల గడప వద్దకే పింఛను మొత్తాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు. జిల్లాలో పింఛనుదారులు 2,82,903 మంది ఉన్నారు.

- పేద విద్యార్థులకు తల్లిదీవెన పథకం కింద ఏడాదికి రూ.1500వేలు అందిస్తామని ప్రకటించారు. అది కూడా ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15వేలు చొప్పున తల్లి బ్యాంక్‌ ఖాతాకు జమచేస్తామన్న హామీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్లింది. జిల్లాలో ప్రాథమిక విద్య నుంచి అన్ని విద్యా సంస్థలను కలిపితే నాలుగున్నర లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. వీరందరికీ ఈథకం ఎంతగానో ఉపయోగపడనుంది. డిగ్రీ, బీటెక్‌ వంటి ఉన్నత విద్య చదువుతున్న పిల్లలకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కూడా చేయనున్నారు.

- వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ యువతకు, నిరుద్యోగులకు ఆశాకిరణంగా కన్పిస్తోంది. దీనికి తోడు ఉద్యోగం సాధించలేని పక్షంలో నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని కూడా ప్రకటించారు. జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో 1.8లక్షల మంది నిరుద్యోగ యువత వివిధ కేటగిరీల్లో నమోదు చేసుకున్నారు. వారంతా ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

- 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 అందిస్తామని ప్రకటించారు. ఇది కూడా మహిళలను అమితంగా ఆకట్టుకుంటోంది. తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ సాయం తోడ్పడుతుందని వారంతా భావిస్తున్నారు. చిన్నచిన్న పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న వారంతా ఈ సాయం కొండంత అండంటున్నారు.

- వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. ఏడాదికి రూ.7500 రైతు భరోసా కింద అందించి రాయితీలన్నింటినీ ఎత్తివేసింది. కూటమి రైతులకు ఏడాదికి రూ.20వేల అర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా రైతులను గతంలో మాదిరిగా అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది.

- మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నది వారిని బాగా ఆకట్టుకుంది. చార్జీల భారం లేకుండా ఉద్యోగాలకు వెళ్లవచ్చునని భావిస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణిస్తున్న వారంతా పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావటం గమనించాల్సిన అంశం. వారంతా ఈ హామీకి గట్టిగా మద్దతు పలుకుతున్నారు.

ఆరు గ్యారెంటీలతో పాటు మోదీ ప్రకటించిన పథకాలను సైతం అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు చంద్రబాబు హామీ ఇవ్వడాన్ని కూడా అందరూ ఆహ్వానిస్తున్నారు. అలాగే వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు నశించాయన్న ఆక్రోశం అందరిలో ఉంది. హక్కుల కోసం పోరాడినా, న్యాయం చేయాలని అడిగినా తిరిగి కేసులు పెట్టడం వంటి అరాచక పాలనతో విసుగుచెందారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా ఎవరు నిరసన తెలిపినా కేసులు నమోదు, అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే నాయకత్వాన్ని ముందస్తు అరెస్టు.. గృహ నిర్బంధాలకు గురి చేశారు. ఈ విధంగా పాలన మొత్తం అరాచకంగా సాగిందని అభిప్రాయపడుతున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి గ్రామ గ్రామాన బెల్టు షాపులు పెంచిన వైనాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. ఈ పరిస్థితిలో వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.

==========

పిల్లలందరికీ తల్లికి వందనం

ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ.15వేలు చొప్పున అందించాలనేది మంచి ఆలోచన. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న పేద పిల్లలను ఈ పథకం ఆదుకుంటుందని నమ్ముతున్నాం.

- పి.రాధ, విద్యార్థి తల్లి.

------------------------------------------------------

రాయితీలు ఇవ్వాలి

రైతాంగానికి రాయితీలు కల్పించి సాగుకు సహకరిస్తే మంచి ఫలితం వస్తుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌, యాంత్రీకరణ, బోర్లు, విద్యుత్‌, సోలార్‌ పంపుసెట్లు రైతుకు మేలు చేసే పథకాలు. ప్రస్తుతం యాంత్రీకరణ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో యాంత్రీకరణ, బోర్లు అన్నవి అత్యంత అవసరం.

ఎల్‌.లక్ష్మణరావు, రైతు, బొబ్బిలి.

--------------------------------------------------------

చార్జీలు భరించలేక పోతున్నాం

ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది మంచిదే. కనీసం తామైనా ఉచిత ప్రయాణం ద్వారా ఉద్యోగాలు హాయిగా చేసుకోవచ్చు. ఆర్థిక భారం తగ్గుతుంది.

టి.అప్పలనసమ్మ, విజయనగరం.

-------------------------------------

భరోసాగా బతకొచ్చు

ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తే మహిళలు మరింత భరోసాగా బతికే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా ఉపాధి ద్వారా మరికొంత ఆదాయాన్ని సంపాదించుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది.

- బి.పార్వతి, దత్తిరాజేరు

----------------------------

Updated Date - May 12 , 2024 | 12:03 AM