Share News

23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:10 AM

పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కాస్త ముందుగాను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23 నుంచి జూన్‌ 11 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం వెల్లడిచారు.

23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 2: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కాస్త ముందుగాను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23 నుంచి జూన్‌ 11 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం వెల్లడిచారు. జూన్‌-12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో 1,765 ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. వాస్తవంగా గతంలో ఏటా ఇదే విధంగా సెలవులు ఉండేవి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. వేసవి సెలవులు ఏ విధంగా ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. కరోనా కారణంగా రెండేళ్లు వేసవి సెలవుల ప్రకటనలో మార్పులొచ్చాయి. పరిస్థితులు మెరుగుపడినప్పటికీ 2022లో మే 6 నుంచి జూలై 5 వరకు సెలవు లిచ్చారు. ఎన్నడు లేని విధంగా అదే ఏడాది మే నెలలో నాలుగు రోజుల పాటు ఉపాధ్యాయులు పాఠశాలలకెళ్లి విధులు నిర్వర్తించారు. గతేడాది మే 1 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులిచ్చారు. ఏప్రిల్‌ 30 ఆదివారమైనా పాఠశాలకు ఆఖరి పనిదినం కావడంతో టీచర్లు విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది ఎన్నికల తరుణంలో వేసవి సెలవుల్లో ఎటువంటి సందిగ్ధత లేకుండా 21 రోజుల ముందే విద్యాశాఖ నుంచి ప్రకటన వెలువడింది.

అంగన్‌వాడీ కేంద్రాలు ఒంటిపూటే..

అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం ఒంటి పూట సెలవులను ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు విడతలు వారీగా వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలను ఈ నెల 4 నుంచి వచ్చే నెల 31 వరకు ఒంటిపూట నిర్వహించాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కేంద్రాలను తెరవాలని ఆదేశించారు. చిన్నారులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు వచ్చేనెల 1 నుంచి 15 వరకు, ఆయాలకు వచ్చే 16 నుంచి 30 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

Updated Date - Apr 03 , 2024 | 12:10 AM