Share News

సాగునీటికి గండం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:09 AM

రాజాం ప్రాంతంలో ఏటా వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ అన్నదాతలకు అండగా నిలిచిన సాగునీటి కాల్వలు నేడు కళతప్పాయి. స్వరూపాన్ని కోల్పోయి పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఏళ్లుగా మరమ్మతుల్లేక శివారు భూములకు వాటా ద్వారా నీరందక దయనీయంగా కనిపిస్తున్నాయి.

సాగునీటికి గండం
పిచ్చిమొక్కలతో తోటపల్లి పిల్లకాలువ

సాగునీటికి గండం

కాల్వలకు మరమ్మతులు చేపట్టని అధికారులు

కళతప్పిన సారధిగెడ్డ, రుద్రసాగరం

దాదాపు 40వేల ఎకరాలకు అందని నీరు

భవిష్యత్‌పై రైతుల్లో గుబులు

రాజాం రూరల్‌, మార్చి 28: రాజాం ప్రాంతంలో ఏటా వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ అన్నదాతలకు అండగా నిలిచిన సాగునీటి కాల్వలు నేడు కళతప్పాయి. స్వరూపాన్ని కోల్పోయి పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఏళ్లుగా మరమ్మతుల్లేక శివారు భూములకు వాటా ద్వారా నీరందక దయనీయంగా కనిపిస్తున్నాయి. సాగునీటి కాల్వలను శుభ్రం చేసి మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోతోంది. ప్రభుత్వం సైతం సాగునీటి వ్యవస్థపై శీతకన్ను వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా సారధిగెడ్డ, రుద్రసాగరంలకు మరమ్మతులు చేపడితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 నుంచి 60 గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే వీలున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

వేల ఎకరాలకు నీరిచ్చే సారధిగెడ్డ

రెండు జిల్లాల్లోని 30 గ్రామాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరందించే సారధిగెడ్డ పూర్తిగా పిచ్చిమొక్కలు, ఇతరత్రా వ్యర్థాలతో నిండిపోయింది. వాన నీటి మిగులు జలాలు చెరువులు, వాగులు, వంకల ద్వారా ప్రవహిస్తూ సారధిగెడ్డలో కలిసేలా బొబ్బిలి రాజులు అప్పట్లో సాగునీటి వ్యవస్థను రూపొందించారు. ఈ గెడ్డ ద్వారా రాజాం మండలంలోని బి.ఎన్‌.వలస, జిసి.పల్లి, మారేడుబాక, కొత్తవలస, సారధి, అంతకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం నాగులవలస, పెంట, కొత్తపెంట గ్రామాల చెరువులను నింపుతూ సంతకవిటి మండలం మండాకురిటి, సిరిపురం తదితర గ్రామాలలోని పొలాలకు సాగునీరందించేది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సారధిగెడ్డ కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు.

30 గ్రామాలకు రుద్రసాగరం

రుద్రసాగరం సైతం మరమ్మతులకు నోచుకోలేదు. తెర్లాం ప్రాంతం నుంచి మిగులు జలాలు రాజాం, రేగిడి మండలాల పరిధిలో సుమారు 30 గ్రామాల రైతాంగానికి సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరందించే రుద్రసాగరం కాలువ అస్తవ్యస్తంగా మారింది. మండలలోని కొత్తపేట, ఒమ్మి, ఆగూరు, అమరాం తదితర గ్రామాల మీదుగా రేగిడి మండలం కాగితాపల్లి, బాలకవివలస, కొర్లవలస, పనసలవలస, తదితర గ్రామాల రైతాంగానికి రుద్రసాగరం ద్వారా సాగునీరందేది. దీనిపైనా నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. కాల్వల్లో పిచ్చిమొక్కలు వెక్కిరిస్తున్నాయి.

తోటపల్లి పిల్లకాల్వలదీ...

తోటపల్లి ప్రధాన కాల్వ నుంచి నియోజకవర్గంలోని వందలాది ఎకరాలకు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పిల్లకాల్వలు సైతం మరమ్మతులకు నోచుకోవడంలేదు. నాలుగు మండాలలోనూ ఇదే దుస్థితి. ఫలితంగా శివారు భూములకు సకాలంలో సాగునీరందక రైతాంగం నానా అవస్థలకు గురవుతున్నారు. భవిష్యత్తులో సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని రైతులు పేర్కొంటున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం

సాగునీటి వనరుల అభివృద్ధి, మరమ్మతులపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. పదేళ్లు అధికారం వెలగబెట్టిన ఎమ్మెల్యే జోగులు రైతుల వెతలపై దృష్టి సారించలేదు. సాగు సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే చొరవ చూపలేదు. ఫలితంగా ఆకాశం వైపు ఎదురుచూడాల్సిన దుస్థితి ఆ ప్రాంత రైతాంగంలో నెలకొంది.

Updated Date - Mar 29 , 2024 | 12:09 AM