Share News

విజయమే లక్ష్యంగా..

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:53 PM

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది... ఏ క్షణాన్నైనా కోడ్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు.

విజయమే లక్ష్యంగా..
అచ్చెన్నాయుడుతో విజయచంద్ర తదితరులు

ముఖ్య నాయకులకు దిశ, నిర్దేశం

అభ్యర్థులను గెలిపించి.. టీడీపీ జెండా ఎగురవేయాలి

సమరానికి సిద్ధంగా ఉండాలంటూ సూచన

పార్వతీపురం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది... ఏ క్షణాన్నైనా కోడ్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. ఈ మేరకు జిల్లాలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వారితో అధినేత ఏమన్నారంటే.. ‘జిల్లాలోని టీడీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపిం చేందుకు పూర్తిస్థాయిలో కష్టపడాలి. పార్వతీపురం, కురుపాం అభ్యర్థులు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరీలను గెలిపించి టీడీపీ జెండా ఎగురువేయాలి. వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాల్సిన బాఽధ్యత మీదే. రాష్ట్ర భవిష్యత్తు.. ప్రజా ప్రయోజనాల కోసం జనసేన పార్టీతో కలిసి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులను ఎంపిక చేశాం. అందులో భాగంగానే జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసి.. ఎన్నికల బరిలోకి దించాం. విభేదాలను పక్కనపెట్టి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలి. జనసేన పార్టీ శ్రేణులను కలుపుకుని అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. వైసీపీ సర్కారు వైఫల్యాలను మరింతగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లి.. ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రతిఒక్కరూ ఓటు వేసే విధంగా చూడాలి. అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. సమరానికి సిద్ధంగా ఉండాలి.. వైసీపీ సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అక్రమంగా కేసులు నమోదు చేసినా.. హౌస్‌ అరెస్ట్‌లు చేసినా.. ధైర్యంగా ముందుకు సాగాలి.. పార్టీ అండగా ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

వారికి భరోసా...

- జిల్లాలో టీడీపీ బీసీ నాయకుడిగా మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌కు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం నియోజకవర్గం నుంచి విజయచంద్రను గెలిపించాలని చంద్రబాబు ఆయనకు సూచించారు. అంతేకాదు రాజకీయ భవిష్యత్తుపై జగదీష్‌కు ఫోన్‌లో చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు విజయమే లక్ష్యంగా పనిచేస్తూ అత్యధిక మెజార్టీతో గెలవాలని అభ్యర్థి విజయచంద్రకు సూచిస్తూ.. జగదీష్‌తో కలిసి ముందుకు సాగాలని అధినేత సూచించినట్టు తెలిసింది.

- కురుపాం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే దీనిపై గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావు అసంతృప్తితో ఉన్నారు. దీంతో చంద్రబాబునాయుడు స్వయంగా లక్ష్మణరావుకు ఫోన్‌ చేసి జగదీశ్వరిని గెలిపించాలని సూచించారు. భవిష్యత్‌లో పార్టీ అధికారంలోకి రాగానే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ఆయనకు సైతం చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇప్పటికే లక్ష్మణరావుకు రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్వహణ కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబు భరోసాతో జగదీశ్వరి గెలుపు కోసం మరింతగా కష్టపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కలిసికట్టుగా పనిచేస్తేనే ...

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తే.. ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యమే. చంద్రబాబు సూచనలతో శ్రేణులను కలుపుకుని నేతలు ముందుకు సాగాల్సి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల కోసం పనిచేస్తూ.. విజయమే లక్ష్యంగా అడుగులు వేయాల్సి ఉంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి.. వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకాల్సి ఉంది.

అచ్చెన్నను కలిసిన టీడీపీ నాయకులు

తెలుగుదేశం పార్టీ పార్వతీపురం అభ్యర్థి బోనెల విజయచంద్ర శనివారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు. పార్వతీపురం నుంచి టీడీపీ-జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గాను అచ్చెన్నకు విజయచంద్రతో పాటు టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం చేస్తున్న కృషి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాయకుల గురించి విజయచంద్ర వివరించారు. టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొవచ్చే విధంగా కృషి చేస్తున్న విజయచంద్రతో పాటు నాయకులను ఆయన అభినందించారు. అచ్చెన్నను కలిసిన వారిలో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల పార్టీ అధ్యక్షులు చంద్రమౌళి, సత్యంనాయుడు, సీనియర్‌ నాయకులు సీతారాం, వెంకటనాయుడు, పి.సత్యనారాయణ, వేణు, కె.రామకృష్ణ, భాస్కర్‌, సూర్యనారాయణ, మధు, గౌరునాయుడు, రెడ్డి శ్రీను, కోరాడ నారాయణరావు, హరిబాబు, పెద్దబ్బాయి, శ్రీను ఉన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:53 PM