Share News

కవ్వింపులకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 30 , 2024 | 11:46 PM

పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు రోజు ఫలితాలను బట్టి రాజకీయ నాయకులు గోరంతలు కొండంతలు చేస్తూ..కవ్వింపులకు పాల్పడితే చర్యలు తప్పవని పాలకొండ డీఎస్పీ జి.వి.కృష్ణారావు హెచ్చరించారు.

కవ్వింపులకు పాల్పడితే కఠిన చర్యలు

పాలకొండ: పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు రోజు ఫలితాలను బట్టి రాజకీయ నాయకులు గోరంతలు కొండంతలు చేస్తూ..కవ్వింపులకు పాల్పడితే చర్యలు తప్పవని పాలకొండ డీఎస్పీ జి.వి.కృష్ణారావు హెచ్చరించారు. ఏ పార్టీవారు కవ్వింపు చర్యలకు పాల్పడినా... ప్రత్యర్థులను రెచ్చగొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కౌంటింగ్‌ అనంతరం ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం వంటివి పూర్తిగా నిషేధమన్నారు. దీనికి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని డీఎస్పీ కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్‌ పికెటింగ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌, ప్రత్యేక సాయుధ బలగాలు, ఇళ్ల వద్ద, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీల నాయకులు సమయ పాలన పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున ప్రజలు రోడ్లపైకి రావడం, గుంపు లుగా ఉండడం చేయరాదని హెచ్చరించారు. వచ్చే నెల 4న ఉల్లిభద్ర దగ్గరలో ఉన్న హార్టికల్చర్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరగనున్న సందర్భంగా అభ్యర్థులు, ఐడీ కార్డు కలిగిన కౌంటింగ్‌ ఏజెంట్లు తప్ప మరెవ్వరూ అక్కడికి వెళ్లకూడదని డీఎస్పీ సూచించారు. లాడ్జీల్లో ఉండడం, మద్యపానం, విందులు, వినోదాలకు అనుమతి లేదన్నారు. గెలిచిన అభ్యర్థులు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:46 PM