గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:27 PM
గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఎంతోమంది యువత, విద్యార్థులు దీని బారినపడ్డారు.

- ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు విస్తృత తనిఖీలు
-పాత నేరస్థులపై నిఘా
- పట్టుబడుతున్న సరుకు
- తగ్గుముఖం పడుతున్న కేసులు
- గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా విక్రయాలు
(విజయనగరం క్రైం/రాజాంరూరల్)
గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఎంతోమంది యువత, విద్యార్థులు దీని బారినపడ్డారు. గంజాయి మత్తుకు ఎందరో జీవితాలు బలైయ్యాయి. ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం డ్రగ్స్, గంజాయి నియంత్రణపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా జిల్లా సరిహద్దుల వెంబడి విస్తృత తనిఖీలు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టింది. దీంతో గంజాయి, డ్రగ్స్ విక్రయదారుల్లో టెన్షన్ మొదలైంది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్.. మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఫలితంగా కొద్ది రోజులుగా జిల్లాలో గంజాయి కేసులు తగ్గుముఖం పడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
రాజాంలో జోరుగా అమ్మకాలు..
రాజాంలో గంజాయి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అరకు ప్రాంతం నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి రాజాం తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. సులభంగా ఆదాయం పొందే లక్ష్యంతో కొంతమంది చేస్తున్న వికృత చేష్టలకు యువత బలైపోతున్నారు.
- రేగిడి మండలం బూరాడలో అదే మండలం పారాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అరకు నుంచి తెచ్చిన రెండు కిలోల గంజాయిలో కొంత రాజాంలో అమ్మి మిగిలినది ఇంటికి తీసుకువెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.
-రాజాంలో ఇటీవల గంజాయి కలిగి ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- గురవాం ప్రాంతంలో ఓ వ్యక్తి మద్యంతో పాటు గంజాయి కూడా అమ్మకాలు చేస్తున్నట్లు బోగట్టా.
- గతంలో రాజాం ఠాణావీఽధిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.7లక్షల విలువ చేసే నిషేధిత పొగాకును విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు పట్టుకున్నారు. ఈ పొగాను ఒడిశా రాష్ట్రం నుంచి దిగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు.
- రాజాంలోని మాధవబజార్‌కు చెందిన ఓ వ్యాపారి ఒడిశా నుంచి పొగాకును తెప్పించి నియోజకవర్గం అంతటా సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇతనితో పాటు వంగర మండలానికి చెందిన ఓ వ్యాపారి ఒడిశా నుంచి కొత్తూరు, సీతంపేట, పాలకొండ మీడుగా దిగుమతి చేసి సుమారు పది మండలాలకు సరఫరా చేస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.
అర్ధరాత్రి దాటాకనే..
ఒడిశాలోని బరంపురం-జైపూర్ పట్టణాలకు రాత్రి పది గంటల తరువాత రాజాం మీదుగా కనీసం 20 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని బస్సులు నవరంగపూర్, పాలకొండ మీదుగా, మరికొన్ని బస్సులు శ్రీకాకుళం-రాజాం మీదుగా వచ్చి వెళ్తుంటాయి. ఈ బస్సులపై నిఘా లేకపోవడంతో ఈ ప్రాంత వ్యాపారుల పాలిట వరంగా మారింది. దీంతో నిషేధిత ఉత్పత్తుల్ని రాజాం పట్టణంలో డంప్ చేస్తున్నారు. రాజాంకు 19 కిలోమీటర్ల దూరంలో చీపురుపల్లి రైల్వేస్టేషన్, 10 కిలోమీటర్ల దూరంలో జి.సిగడాం రైల్వేస్టేషన్ ఉంది. దీంతో కొంతమంది వ్యాపారులు రైల్వేమార్గం ద్వారా అక్రమంగా మాదక ద్రవ్యాలను రాజాం తీసుకువస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తరహా వ్యాపారం చేసి రూ.లక్షలు అర్జిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా పోలీసులు దాడులు చేస్తుండడంతో వ్యాపారులు వణికిపోతు న్నారు. గంజాయి, పొగాకు తదితర మత్తుపదార్థాలను క్రయవిక్రయాలు చేసేందుకు భయపడుతున్నారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం ఈ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం
జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాయి. పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టాం. అనుమానితులపై సస్పెక్ట్‌డ్ షీట్‌లు తెరుస్తాం. తరచుగా గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, ప్రధాన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? ఎవరెవరి హస్తం ఉందో? గుర్తించి దాని మూలాలను బయటకు తీస్తాం. జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసుశాఖ కృషి చేస్తోంది.
- వకుల్ జిందాల్, ఎస్పీ, విజయనగరం
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో
అవగాహన సదస్సు రేపు
విజయనగరం (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలు లేని సమాజం కోసం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ తన వంతుగా కృషి చేస్తోంది. ఈ మేరకు మిమ్స్ కళాశాల యాజమాన్యంతో కలిసి మంగళవారం ఉదయం 10 గంటలకు యువతకు అవగాహన సదస్సు నిర్వహించనుంది. మిమ్స్ కళాశాల ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. ముఖ్యఅతిథులుగా కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీ ఆస్మాపరహీన్, శ్రీరామ ఎడ్యుకేషనల్ చైర్మన్ కె.సత్యనారాయణరాజు హాజరుకానున్నారు. కొంతమంది యువత మాదకదవ్యాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసు నుంచే గంజాయి, నల్లమందు తదితర డగ్స్‌కు అలవాటుపడి అనారోగ్యానికి గురవుతున్నారు. వారి కుటుంబాలను అగాథంలోకి నెట్టేస్తున్నారు. చదువు, భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. యువతకు దిశా నిర్దేశం చేసి, తద్వారా సమాజంలో వారిని ఉత్తములుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నెల్లిమర్లలోని మిమ్స్ కళాశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించనుంది.