Share News

సాఫ్ట్‌వేర్‌ టు మినిస్టర్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:21 PM

గజపతినగరం నియోజకవర్గం నుంచి మొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండపల్లి శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో కూడా చోటు లభించింది. గన్నవరంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార వేదికపై ఆయన మంత్రిగా బుధవారం ప్రమాణం చేశారు.

సాఫ్ట్‌వేర్‌ టు మినిస్టర్‌
ప్రమాణం చేస్తున్న శ్రీనివాస్‌

సాఫ్ట్‌వేర్‌ టు మినిస్టర్‌

అమెరికాలో మాస్టర్స్‌.. అక్కడే ఉద్యోగం

ఐదేళ్ల క్రితం స్వదేశానికి వచ్చిన శ్రీనివాస్‌

తొలిసారి గెలుపుతోనే మంత్రిగా అవకాశం

గజపతినగరం, జూన్‌ 12: గజపతినగరం నియోజకవర్గం నుంచి మొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండపల్లి శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో కూడా చోటు లభించింది. గన్నవరంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార వేదికపై ఆయన మంత్రిగా బుధవారం ప్రమాణం చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్‌కు అనూహ్యంగా టీడీపీ నుంచి టిక్కెట్‌ లభించింది. ఎన్నికల్లో ప్రత్యర్థి బొత్స అప్పలనరసయ్యపై 25,310 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే సమయంలో ఈనియోజకవర్గం నుంచి 28 ఏళ్ల తరువాత మంత్రి పదవి దక్కించుకున్న నాయకునిగా రికార్డుకెక్కారు.

కుటుంబ నేపథ్యం

కొండపల్లి శ్రీనివాస్‌ స్వగ్రామం గంట్యాడ. 1982 ఏప్రిల్‌ 13న కొండపల్లి కొండలరావు, సునీత దంపతులకు జన్మించారు. శ్రీనివాస్‌కు భార్య లక్ష్మిసిందూ, కుమారుడు విహన్‌, కుమార్తె మేధ ఉన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత చదువులు అభ్యసించి విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ నిపుణులుగా పనిచేశారు. తనవృత్తిలో భాగంగా అనేక దేశాలు తిరిగి జన్మభూమికి సేవ చేయాలన్న తలంపుతో సొంత ప్రాంతానికి వచ్చేశారు. జిల్లాలో రోటరీ క్లబ్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో ఆర్వో ప్లాంట్‌కు నిధులు సమకూర్చడంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, క్రీడా సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహయం అందజేస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తూ వస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి

శ్రీనివాస్‌ ప్రాథమిక విద్యాభాసం విజయనగరం, అరకు ప్రాంతాల్లోని సెయింట్‌ జోసఫ్‌ స్కూలులో సాగింది. ఇంటర్‌ విశాఖలోని విజ్జాన్‌లో చదివారు. జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ కంప్యూటర్‌ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికాలోని ఒరాకిల్‌ సంస్థలో ఈఆర్‌పీ సొల్యూషన్స్‌ విభాగంలో సుదీర్ఘకాలం సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్ల క్రితం తిరిగి స్వదేశానికి వచ్చారు. రియల్‌ ఎస్టేట్‌, కనస్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో ఉన్నారు. ఎన్నికలకు మూడు నెలలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఈయన చిన్నాన్న.

రాజకీయ నేపథ్యం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొండపల్లి కుటుంబం పార్టీలోనే ఉంది. మూడుతరాల రాజకీయ నేపథ్యం కలిగి ఉంది. శ్రీనివాస్‌ మూడో తరం వారసుడిగా ఉన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేయడమే కాకుండా విజేతగా నిలిచారు. అంతలోనే మంత్రి పదవిని కూడా పొందారు. శ్రీనివాస్‌ తాతయ్య కొండపల్లి పైడితల్లి నాయుడు ఉమ్మడి జిల్లాలో బొబ్బిలి పార్లమెంట్‌ సభ్యునిగా 11వ, 12వ, 14వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా సేవలు అందించారు. శ్రీనివాస్‌ తండ్రి కొండలరావు గంట్యాడ మండల ఎంపీపీగా పనిచేశారు. తల్లి తరుపున తాతయ్య అప్పికొండ సత్యంనాయుడు 1962-82మధ్యకాలంలో సాలూరు సమితి అధ్యక్షులుగా సేవలు అందించారు. బాబాయి కొండపల్లి అప్పలనాయుడు గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2014-19లో పనిచేశారు.

28ఏళ్ల తర్వాత మంత్రి పదవి

గజపతినగరం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఆవర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో జంపన సత్యన్నారాయణరాజు ఎమ్మెల్యే అయ్యారు. అయన మరణాంతరం బొండపల్లి ఎంపీపీగా ఉన్న పడాల అరుణకు అవకాశం రావడంతో 1989, 1994, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ 1996లో రాష్ట్ర శిశు సంక్షేమ సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రిగా పదవి వరించింది. 2009, 2019లో రెండుపర్యాయాలు బొత్స అప్పలనరసయ్య, 2014లో కొండపల్లి అప్పలనాయుడు ఎమ్మెల్యే అయ్యారు. వీరిలో ఏఒక్కరికీ మంత్రి పదవి రాలేదు. ఈ ఎన్నికల్లో గెలిచిన శ్రీనివాస్‌ మంత్రి అయ్యారు. ఈ లెక్కన నియోజకవర్గంలో 28 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కింది.

Updated Date - Jun 12 , 2024 | 11:21 PM