Share News

సో‘సెల్‌’ మీడియా!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:22 AM

గత ఎన్నికల్లో ఎస్సెమ్మెస్‌లకే పరిమితమైన ప్రచారం.. ఈసారి ఆధునికతను అందిపుచ్చుకుంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

సో‘సెల్‌’ మీడియా!

- వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రచారం

- యూట్యూబ్‌లో అప్‌లోడ్‌.. లైవ్‌ వీడియోలు

- ప్రచారాల ఫోటోలు కూడా..

(రాజాం రూరల్‌)

గత ఎన్నికల్లో ఎస్సెమ్మెస్‌లకే పరిమితమైన ప్రచారం.. ఈసారి ఆధునికతను అందిపుచ్చుకుంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమ నాయకుడు ఏ రోజు.. ఏ సమయానికి.. ఏ వీధికి.. ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి ప్రచారానికి వస్తున్నారో సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్లిన క్షణాల్లోనే ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇందుకోసం అన్ని పార్టీల అభ్యర్థులూ ఒక్కొక్కరు కనీసం నలుగురైదుగురిని నియమించుకొని.. తమ రోజువారీ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారు.

అందరిదీ అదే బాట..

జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల నుంచి కూటమి, అధికార పార్టీల నుంచి 14 మంది శాసనసభకు.. ఇద్దరు లోక్‌సభకు పోటీలో ఉన్నారు. నామినేషన్ల పర్వం పూర్తయ్యేసరికి మరికొంత మంది అభ్యర్ధులు బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదు. వీరిలో కూటమి, అధికార పార్టీలకు చెందిన అభ్యర్ధులు ప్రత్యేకంగా సోషల్‌మీడియాకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ప్రచారానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు సైతం ఎప్పటికప్పుడు లైవ్‌లో వస్తున్న ప్రచారాలను చూసి తమకు నచ్చినవారి ప్రచారాలు ‘షేర్‌’ చేస్తున్నారు. అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే అభినందిస్తున్నారు. ఉత్సవ విగ్రహాలుగా అధికారాన్ని అనుభవించిన వారి పట్ల దురుసుగానే కామెంట్ల రూపంలో జవాబులిస్తున్నారు.

లైవ్‌ వీడియోలు..

దాదాపుగా ప్రచారంలో లైవ్‌ వీడియోలకు ప్రాధాన్యం పెరిగింది. నాయకుడు గ్రామంలోనికి అడుగుపెట్టింది మొదలు ప్రజలతో మమేకమవుతూ... తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్ధిస్తున్న ప్రతి సన్నివేశాన్ని లైవ్‌ద్వారా ఫేస్‌బుక్‌... యూట్యూబ్‌లలో ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు కూడా ఇదే పంథాలో నాయకులను అనుసరిస్తున్నారు.

వాట్సాప్‌ గ్రూపులలో...

ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వందలాది మందికి చేరవేస్తున్నారు. పార్టీలు, కులాలు, కుటుంబాలు, ఉద్యోగ సంఘాలు, మీడియా, అధికారులు, ఇతరత్రా గ్రూపుల్లో పోస్ట్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి క్షణాల్లో మిగిలిన వారు షేర్‌ చేస్తున్నారు. దీంతో అత్యంత వేగంగా ప్రచారం జనంలోకి వెళ్లిపోతోంది. ఫలితంగా తక్కువ ఖర్చు...స్వల్ప సమయంలో వేలాదిమందికి సమాచారం చేరవేస్తున్నారు.

యూట్యూబ్‌లో...

ప్రస్తుతం యూట్యూబ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రత్యేకంగా వీడియోలను తయారు చేయిస్తున్నారు. పార్టీల హామీలను... గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ... భవిష్యత్‌లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ... వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. లక్షలాది మంది వీక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:22 AM