Share News

మంచు‘టెండ’

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:47 PM

జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం వేళ ఎండ ఠారెత్తిస్తోంది. ఒక్కసారిగా మారిన ఈ వాతావరణంతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు.

మంచు‘టెండ’
పార్వతీపురంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానాన్ని కమ్మేసిన పొగమంచు

కొన్నిచోట్ల సాయంత్రం వేళల్లో చిరుజల్లులు

జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు

ఈ మార్పులతో జిల్లావాసులకు తప్పని ఇబ్బందులు

వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

పార్వతీపురం టౌన్‌/కొమరాడ/భామిని : జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం వేళ ఎండ ఠారెత్తిస్తోంది. ఒక్కసారిగా మారిన ఈ వాతావరణంతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి మన్యాన్ని కొద్దిరోజులుగా మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు ఇదే పరిస్థితి. దీంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఓ మోస్తరుగా చలి కూడా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. సామాన్యులు సైతం తెల్లవారుజామున వాకింగ్‌ చేయలేని పరిస్థితి. జీడి, మామిడి, అపరాలు, వాణిజ్య పంటలపైనా పొగమంచు ప్రభావం పడుతోంది. అయితే ఉదయం పది గంటల తర్వాత మాత్రం సీన్‌ మారుతోంది. మెల్లగా పొగమంచు తొలగిపోగా.. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వాస్తవంగా ఏటా రథసప్తమి, మహాశివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. మధ్యాహం సమయాల్లో ఎండ వేడి అధికంగా ఉండగా.. ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వేసవిలో తొలుత మోస్తరు వేడి, ఆ తరువాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు సైతం హెచ్చరిస్తుం డడంతో ప్రజలు మరింతగా టెన్షన్‌ పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల మేర నమోదువుతున్నాయి. సాయంత్రానికి కనిష్టంగా 20 నుంచి 19 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అయితే రానున్న కాలంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది కంటే తీవ్రమైన వేసవి చూడబోతున్నామని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిహాట్‌గా ఉంటుందని అంచనా వేస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం జిల్లాలో ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ వాతావరణంలో మార్పులను ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తుండగా.. మన్యం వాసులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

భామినిలో చిరుజల్లులు

భామినిలో బుధవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం పొగ మంచు.. మధ్యాహ్నం ఎండ అధికంగా ఉండగా.. సాయంత్రం మాత్రం ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత ఓ మోస్తరుగా చిరుజల్లులు పడ్డాయి. గత ఐదు నెలలుగా చినుకు తడి లేదని .. భారీ వర్షం కురిసి ఉంటే.. రబీ పంటలకు ఉపయోగపడేదని మండల రైతులు తెలిపారు. నువ్వు దుక్కులకు, మామిడి, జీడికి మేలు జరిగేదని వారు చెబుతున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:47 PM