సిరి సంబరం
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:32 PM
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు ఎస్.కోట మండలంలోని కొట్టాం కోటమ్మతల్లి సిరిమానోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది.

- ఘనంగా కొట్టాం కోటమ్మ సిరిమానోత్సవం
- పోటెత్తిన భక్తులు
శృంగవరపుకోట రూరల్, ఏప్రిల్ 3: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు ఎస్.కోట మండలంలోని కొట్టాం కోటమ్మతల్లి సిరిమానోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంబరానికి ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీష్‌గడ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు సిరిమాను పూజారి రంధీ నాగభూషణంను గ్రామపెద్ద సేనాపతి కోటరావు నాయుడు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ సేనాపతి రమణబాబు ఆధ్వర్యంలో గద్దె గుడి నుంచి సిరిమాను వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం సిరిమానును పూజారి నాగభూషణం అధిరోహించారు. వేలాదిమంది భక్తుల మధ్య సిరిమానోత్సవం జరిగింది. జైకోటమ్మ నామస్మరణ మార్మోగింది. సిరిమాను వెంబడి అంజలీ రథాలు, కోటమ్మ మాలధారులు, కోటమ్మపచ్చడితో నెయ్యిల కులస్థులు కదిలారు. రాత్రి 7.15 గంటలకు చిన్నమ్మి గుడికి సిరిమాను చేరింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సేనాపతి బాలసన్యాసమ్మ, గ్రామపెద్ద చంద్రరావు పర్యవేక్షించారు. 50వేలకు పైబడి భక్తులు హాజరైనట్లు అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో నాగేంద్ర ఏర్పాట్లు చేశారు.