Share News

ఉప ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:37 AM

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులు మరణాలు కట్టడి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాజు,పండు డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యార్థులతో కలిసి సాలూరులో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఇంటిని ముట్టడించారు.

ఉప ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి
ఉపముఖ్యమంత్రి ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన విద్యార్థి నాయకులు

సాలూరు,ఫిబ్రవరి 26: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులు మరణాలు కట్టడి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాజు,పండు డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యార్థులతో కలిసి సాలూరులో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఇంటిని ముట్టడించారు. తొలుత వారు పట్టణంలోని బోస్‌బొమ్మ జంక్షన్‌ నుంచి జైపూర్‌ రోడ్డు మీదుగా డిప్యూటీ సీఎం ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మాట్లాడుతూ.. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల వరుస మరణాలపై సమగ్ర దర్యాప్తును జరపాలన్నారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 17 మంది గిరిజన విద్యార్థులు మరణించినా.. ప్రజాప్రతినిధులు , ఐటీడీఏ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఐటీడీఏ ద్వారా ఉద్యోగంతో పాటు రూ. పది లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలు నియమించాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని, రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని, మెస్‌ చార్జీలు పెంచాలని, ఏఎన్‌ఎంలను నియమించాలని వారు నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అమరావతిలో ఉండడంతో ఆయన పీఏ బేగ్‌కు వినతిపత్రం అందించారు. ఈ నిరసనలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంగారాం, అఖిల్‌, సింహాచలం, శ్రీను, లోకేష్‌, రంజిత్‌, రామకృష్ణ, రమేష్‌, గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:37 AM