Share News

ఆమె.. పదిసార్లు ‘డమ్మీ’!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:42 AM

శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామానికి చెందిన గొంప సత్యవతి డమ్మీ అభ్యర్థిగా రికార్డు సాధించారు.

ఆమె.. పదిసార్లు ‘డమ్మీ’!
ఎస్‌.కోట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికు నామినేషన్‌ అందిస్తున్న టీడీపీ డమ్మీ అభ్యర్ధి గొంప సత్యవతి

- తండ్రి తరపున ఆరుసార్లు... కుమార్తెకు నాలుగుసార్లు

- ఆనవాయితీ కొనసాగిస్తున్న గొంప సత్యవతి

శృంగవరపుకోట/కొత్తవలస: శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామానికి చెందిన గొంప సత్యవతి డమ్మీ అభ్యర్థిగా రికార్డు సాధించారు. ఒకటీ.. రెండుసార్లు కాదు. వరుసగా పదిసార్లు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోళ్ల లలిత కుమారికి డమ్మీ అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణకు బుధవారం నామినేషన్‌ పత్రాలను అందించారు. ఆమె మాజీ మంత్రి దివంగత కోళ్ల అప్పలనాయుడు పెద్ద కుమార్తె. ప్రస్తుత శృంగవరపుకోట టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి తల్లి. ఉత్తరాపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తండ్రికి డమ్మీ అభ్యర్థిగా మొదటిసారి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆ తరువాత 1985, 89, 94, 99, 2004లో వరుసగా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. పునర్విభజనలో ఈ నియోజకవర్గం రద్దు కావడంతో శృంగవరపుకోట జనరల్‌ నియోజకవర్గం నుంచి కోళ్ల అప్పలనాయుడు వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మనమరాలు, కోడలు కోళ్ల లలిత కుమారికు 2009, 2014, 2019లోను డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లలిత కుమారికి డమ్మీగా నామినేషన్‌ వేశారు. ఇలా మొత్తం పదిసార్లు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఈ పది పర్యాయాల్లో తన తండ్రి ఐదుసార్లు... కుమార్తె రెండు దఫాలు మొత్తం ఏడుసార్లు విజయం సాధించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:42 AM