Share News

నేటి నుంచే శంఖారావం.. సర్వం సిద్ధం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:29 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘శంఖారావం’ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పాలకొండలో లోకేశ్‌ యాత్ర ప్రారంభం కానుంది. బుధవారం రాత్రి సాలూరులో నిర్వహించనున్న సభతో పర్యటన ముగియనుంది.

నేటి నుంచే శంఖారావం.. సర్వం సిద్ధం
పాలకొండలో ముస్తాబవుతున్న సభా ప్రాంగణం

రోజూ రెండు నియోజకవర్గాల్లో సభలు

ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు

పార్వతీపురం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘శంఖారావం’ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పాలకొండలో లోకేశ్‌ యాత్ర ప్రారంభం కానుంది. బుధవారం రాత్రి సాలూరులో నిర్వహించనున్న సభతో పర్యటన ముగియనుంది. అయితే జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా లోకేశ్‌ ‘మన్యం’కు వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభల విజయవంతానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున సభలకు తరలివచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో 120 నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర చేపట్టనున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జిల్లా ప్రజలకు ఆయన వివరించనున్నారు. అనివార్య కారణాల వల్ల యువగళం పాదయాత్ర ముగింపు సభను భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించారు. అప్పటి పరిస్థితుల కారణంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో లోకేశ్‌ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టని నియోజకవర్గాల్లో తాజాగా శంఖారావం సభలు నిర్వహించనున్నారు. జిల్లాలో రోజూ రెండు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు.

పర్యటన ఇలా..

శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్‌ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో యాత్ర పూర్తయిన తర్వాత ఆయన మధ్యాహ్నం పాలకొండకు చేరుకుంటారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో శంఖారావం సభ నిర్వహించనున్నారు. సాయంత్రం కురుపాం నియోజకవర్గం గురుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి వద్దకు చేరుకోనున్నారు. రాత్రి పార్వతీపురం చేరుకుని బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం మండలం వెంకమ్మపేట వై.జంక్షన్‌ వద్ద సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాలూరు చేరుకుని శంఖారావం సభ నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలకు అవకాశం కల్పించనున్నారు. అదే విధంగా అభిమానులతో సెల్ఫీ విత్‌ లోకేశ్‌ కార్యక్రమానికి కూడా ప్రత్యేక సమయం కేటాయించనున్నారు.

శ్రేణుల్లో జోష్‌

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరగడం, శ్రీకాకుళం జిల్లాలో లోకేష్‌ శంఖారావం యాత్రకు విశేష స్పందన వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతన జోష్‌ నెలకొంది. మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ‘మన్యం’లోనూ లోకేశ్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్యలు చేపడుతున్నారు.

జయప్రదం చేయండి

పాలకొండ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపడుతున్న శంఖారావం సభను జయప్రదం చేయాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పాలకొండ విచ్చేశారు. పాలకొండ- వీరఘట్టం రోడ్డులో మంగళవారం లోకేశ్‌ నిర్వహించనున్న శంఖారావం సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ.. అరాచక పాలన చేపడుతున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శంఖారావం పేరుతో లోకేశ్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో రానున్న ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారన్నారు. స్థానిక నాయకుల ద్వారా సమస్యలను తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. వైసీపీ సర్కారు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని దీక్షతో లోకేశ్‌ను యువగళం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. చివరకు మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపైనా అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఈ అరాచక పాలనకు చరమ గీతం పాడేందుకు జనసేనతో కలిసి అంతా పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ సర్కారు ఓటమి ఖాయమని, టీడీపీ విజయం తథ్యమని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, నాయకులు క అప్పలనాయుడు, కృష్ణమూర్తినాయుడు, రామినాయుడు, సంతోష్‌కుమార్‌, నారాయణరావు, ఉదయ్‌భాస్కర్‌, జనసేన నాయకులు నిమ్మక నిబ్రం, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా ఏర్పాట్లు...

శంఖారావం పేరిట ఈ నెల 13న తొలిసారిగా లోకేశ్‌ పాలకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకొండ-వీరఘట్టం రోడ్డులోని విశాలమైన ప్రాంగణంలో సభా వేదికను సిద్ధం చేశారు. సుమారు 15 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పాలకొండ పట్టణమంతా పసుపుమయంగా మారింది. ఎటుచూసినా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. లోకేశ్‌ పర్యటన విజయవంతానికి నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

సిక్కోలులో నీరా‘జనం’

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపడుతున్న శంఖారావం యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. తొలిరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు విజయవంత మయ్యాయి. రెండో రోజు సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర నిర్వహించగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రానున్నది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనంటూ లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాను ప్రత్యేక బాధ్యత వహిస్తానంటూ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులు, అమలు చేయనున్న పథకాల గురించి వివరిస్తూ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చారు. నరసన్నపేటలో లోకేశ్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో నదుల అనుసంధానానికి తట్టెడు మట్టి కూడా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వేయలేకపోయారని, టీడీపీ-జనసేన కార్యకర్తలు రాబోయే రెండు నెలలుపాటు ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అరాచకాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా, మంత్రిగానూ ఉన్నారని, ఆయన కుమారుడు ఇసుక దోపిడీ తప్ప.. నియోజకవర్గానికి చేసిందేమిటంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి గురించి శ్వేతపత్రం విడుదల చేయగలమన్నారు. వైసీపీ పాలనలో కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేదని.. సావిత్రీపురం వద్ద 23 ఎకరాలను మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కొట్టేశారని ఆరోపించారు.

Updated Date - Feb 13 , 2024 | 12:29 AM