Share News

పూర్తయిన నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:15 PM

జిల్లాలో శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సజావుగా పూర్తయింది. అరకు పార్లమెంట్‌, నాలుగు శాసనసభ స్థానాలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించారు.

 పూర్తయిన నామినేషన్ల పరిశీలన

పార్వతీపురం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి)/ కురుపాం/ సీతంపేట/ సాలూరు రూరల్‌: జిల్లాలో శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సజావుగా పూర్తయింది. అరకు పార్లమెంట్‌, నాలుగు శాసనసభ స్థానాలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించారు. అయితే అరకు పార్లమెంట్‌ పరిధిలో 32 నామినేషన్లు పడగా.. ఇందులో ఎనిమిది మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. నాలుగు నియోజకవర్గాల్లో మొత్తంగా 61 నామినేషన్లు దాఖలవగా.. పాలకొండలో 10 మందికి గాను ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లుగా ఎన్నికల ఆర్వో శుభం బన్సాల్‌ తెలిపారు. నామినేషన్లు వేసిన అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో శుక్రవారం సీతంపేట ఐటీడీఏ రిటర్నింగ్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. మిగతా పది మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయన్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి పది మంది నామినేషన్లు ఆమో దించగా మరో ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. కురుపాంలో ఆర్వో వీవీ రమణ ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. 11 నామినేషన్లకు గాను మూడింటిని తిరస్కరించారు. ఎనిమిది మందివి ఆమోదించారు. సాలూరు నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లను అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఆర్వో విష్ణుచరణ్‌ పరిశీలించారు. మొత్తంగా పది నామినేషన్లకు గాను రెండు నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:15 PM