పోలింగ్ స్టేషన్ల కోసం పాఠశాలలను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:18 PM
పోలింగ్ కేంద్రాలుగా వినియోగిం చేందుకు పాఠశాలలను సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.

- 15 రోజుల్లో పనులు పూర్తి కావాలి: కలెక్టర్
కలెక్టరేట్, జనవరి 12: పోలింగ్ కేంద్రాలుగా వినియోగిం చేందుకు పాఠశాలలను సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పారు. తాగునీరు, మరుగు దొడ్లు, ర్యాంపులు, విద్యుత్, ఫర్నిచర్, నేమ్ బోర్డులు తప్పసరిగా ఉండాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 1,847 పోలింగ్ కేంద్రాలకు 223 మంది సెక్టార్ అధికారులను నియమించామని, వారంతా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించారని తెలిపారు. దీని ప్రకారం 397 పాఠశాలల్లో ర్యాంపులు, 204 పాఠశాలల్లో నేమ్ బోర్డులు, 83 స్కూళ్లల్లో తాగునీటి సదుపాయం, 75 బడుల్లో మరుగుదొడ్లు, 67 పాఠశాలల్లో ఫర్నిచర్, 27 పాఠశాలల్లో ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వెంటనే పనులు ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చాలా పాఠశాలల్లో ఇప్పటికే ఆర్‌వో ప్లాంటు, మరుగుదొడ్లు ఉన్నాయన్నారు. అవిలేని చోట తాత్కాలిక పద్ధతిలోనైనా ఏర్పాటు చేయాలని సూచించారు. శాశ్వత అవసరాలకు వినియోగించే విధంగా విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు అన్ని గదుల్లో ఉండాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ బూత్‌లోకి సులువుగా చేరుకొనే విధంగా నిర్దేశిత ప్రమాణాలతో ర్యాంపులను నిర్మించాలని తెలిపారు. అవకాశం ఉంటే రెయిలింగ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 147 పోలింగ్ బూత్‌లు మాత్రమే ప్రభుత్వేతర భవనాల్లో ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో అనిత, డీఈవో లింగేశ్వరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ శాంతి కుమారి, గృహ నిర్మాణ పీడీ శ్రీనివాసరావు, డీవీఈవో భీమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.