Share News

టీచర్‌ నుంచి సాలూరు ఎమ్మెల్యేగా సంధ్యారాణి ప్రస్థానం

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:14 AM

సాలూరు తొలి మహిళా ఎమ్మెల్యేగా టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి చరిత్ర సృష్టించారు.

టీచర్‌ నుంచి  సాలూరు ఎమ్మెల్యేగా  సంధ్యారాణి ప్రస్థానం
సాలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన సంధ్యారాణి

సాలూరు/సాలూరు రూరల్‌, జూన్‌ 4: సాలూరు తొలి మహిళా ఎమ్మెల్యేగా టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి చరిత్ర సృష్టించారు. మక్కువ మండలం కవిరిపల్లిలో మార్చి 15, 1974లో జన్ని ముత్యాలు, పార్వతమ్మలకు సంధ్యారాణి జన్మించారు. డిగ్రీ వరకు చదివిన ఆమె గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆమె మెట్టినిల్లు సాలూరు నియోజకవర్గం పరిధి మెంటాడ మండలం లింగాలవలస. ఆమె భర్త జయకుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ఆమెకు కుమారుడు పృథ్వీ, కుమార్తె ప్రణతి ఉన్నారు. ఆమె తండ్రి జన్ని ముత్యాలు సైతం 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున సాలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకుని ఆమె రాజకీయాల్లో ఒడుదుడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. తొలుత 1999లో సాలూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం 2004లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో స్త్రీ శిశు సంక్షేమశాఖ విశాఖ రీజియన్‌ చైర్‌పర్సన్‌గా పదవి పొందారు. 2009లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ లభించలేదు. దీంతో ఆమె 2009లో తెలుగుదేశంలో చేరి సాలూరు టిక్కెట్‌ సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో 1,656 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2014లో టీడీపీ సాలూరు అసెంబ్లీ టిక్కెట్‌ దక్కలేదు. అయితే అదే ఏడాది ఆమె ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో సైతం ఆమెకు టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు. అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలుగా కొన్నాళ్లు పనిచేశారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సాలూరు బరిలో దిగారు. తన వ్యూహ చాతుర్యంలో ఎన్నికల్లో చక్రం తిప్పారు. అధిక ఓట్లుతో విజయం సాధించి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగుర వేశారు. రాష్ట్రంలో అతి పురాతన మున్సిపాల్టీ సాలూరు. ఇద్దరు గిరిజన సంక్షేమ మంత్రులు ఇక్కడ నుంచే పనిచేశారు. కాగా 72 ఏళ్ల చరిత్ర కలిగిన సాలూరు నియోజకవర్గంలో మొదటిసారిగా ఓ మహిళా ఎమ్మెల్యేగా గుమ్మిడి సంధ్యారాణి విజయం సాధించి రికార్డు నమోదు చేశారు.

Updated Date - Jun 05 , 2024 | 01:14 AM