ఇసుక పూర్తిగా ఉచితం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:00 AM
ఇసుక సరఫరా పూర్తిగా ఉచితమేనని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తవ్వకాలు, ఇతర నిర్వహణ, రవాణా ఖర్చులు మాత్రమే ప్రజలు భరించాల్సి ఉంటుందని చెప్పారు.

కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఇసుక సరఫరా పూర్తిగా ఉచితమేనని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తవ్వకాలు, ఇతర నిర్వహణ, రవాణా ఖర్చులు మాత్రమే ప్రజలు భరించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతరత్రా చెల్లింపులేవీ ఉండవని స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లా డుతూ...ఎవరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి.. రవాణా, విక్రయాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే సహించ బోమని తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో ఎటువంటి లోపాలు ఉండకూడదన్నారు. స్థానికంగా ఉండే ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం నుంచి త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయని చెప్పారు. ఇసుక రీచ్‌ల వద్ద యంత్రాలు ఉపయోగించరాదని వెల్లడించారు. అనుమతులు లేని చోట్ల ఇసుక రీచులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు సీజ్ చేసి, భారీగా జరిమానా విధిస్తామని తెలిపారు. ఇసుక సరఫరా పక్కాగా జరగాలని, ప్రతి అంశానికి రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయం త్రం ఆరు గంటల వరకు ఇసుక రీచ్‌లు నిర్వహించాలని సూచించారు. జిల్లాకు అవసరమైన ఇసుక అవసరాలు గుర్తించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. వంశధార నది తీరంలో కొత్త ఇసుక రీచ్‌ల లభ్యతను గుర్తించాలన్నారు. భామిని మండలం కాట్రగడ్డ అనుమతుల మేరకు ఇసుక తవ్వకాలు జరపాలని, నేరడి, పసుపూడి వద్ద ఇసుక రీచ్ ప్రారంభానికి చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో జేసీ శోభిక, ఎస్పీ మాధవరెడ్డి, ఆర్డీవోలు హేమలత, వెంకటరమణ, డీపీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.