Share News

నేటి నుంచి ‘శంబర’ం

ABN , Publish Date - Jan 22 , 2024 | 12:33 AM

శంబరలో సందడి మొదలైంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరలో తొలి అంకమైన తొలేళ్లు ఉత్సవానికి సర్వం సిద్ధమైంది.

నేటి నుంచి ‘శంబర’ం
చదురుగుడిలో శంబర పోలమాంబ

రేపు సిరిమానోత్సవం

భారీగా తరలిరానున్న భక్తులు

సాలూరు రూరల్‌/మక్కువ, జనవరి 21: శంబరలో సందడి మొదలైంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరలో తొలి అంకమైన తొలేళ్లు ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం రాత్రి సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నెల 23న సిరిమానోత్సవం, 24న అంపకోత్సవం జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి భక్తుల లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో దేవదాయ శాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు పోలమాంబ శీఘ్ర దర్శన భాగ్యం కల్పించనున్నారు. మరోవైపు గ్రామంలో చురుగ్గా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. 70 వేల లడ్డూలను తయారు చేయిస్తున్నారు. రద్దీ, జాతరకొచ్చే భక్తుల పర్యవేక్షణకు రెండు డ్రోన్‌ కెమెరాల వినియోగించనున్నారు. కాగా తొలి జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలమాంబ దేవస్థానం ఈవో వీవీ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. పది వారాల పాటు జాతర నిర్వహించ నున్నామన్నారు.

డ్రోన్‌, బాడీ వేర్‌ కెమెరాలతో నిఘా

జాతరలో ప్రత్యేకంగా బాడీ వేర్‌ కెమెరాలతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిమానోత్సవం రోజున రెండు డ్రోన్‌ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఐదుగురు డీఎస్సీలు , 15 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, దాదాపు 600 మంది భద్రత సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

తరలివచ్చిన సిరిమాను

శంబర సమీపంలో గున్నాం కొండ వద్ద గుర్తించిన సిరిమాను తాడిచెట్టును, బట్టివలస వద్ద గుర్తించిన గుజ్జుమానును ఏరువాక ద్వారా శంబర గ్రామంలోకి తీసుకొచ్చారు. దానిని సిరిమానుగా సోమవారం తయారు చేయనున్నారు.

150 ఆర్టీసీ బస్సులు

శంబర జాతర సందర్భంగా 150 ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడపనున్నట్టు జిల్లా ప్రజారవాణాధికారి టీవీఎస్‌ సుధాకర్‌ ఆదివారం చెప్పారు. తొలేళ్లు సందర్భంగా సోమవారం 15 బస్సులు, 23న సిరిమానోత్సవం రోజు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఆరు ఆర్టీసీ డిపోల నుంచి 115 బస్సులు, ఈ నెల 24 అంపకోత్సవం రోజున 20 బస్సులను నడపనున్నట్టు తెలిపారు.

జాతర నిర్వహణ

ఏటా పుష్యమాసంలో ధనుర్మాసం ప్రారంభం రోజున పెదపోలమాంబ జాతర ప్రకటిస్తారు. వారం రోజుల పాటు ఘటాలను శంబరలో పూజలు చేశారు. పెద పోలమాంబ అంపకోత్సవం రోజున పోలమాంబను గ్రామంలోకి తెచ్చి పూజలు నిర్వహిస్తారు. పోలమాంబ అంపకోత్సవం ముందు రోజు సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఈ సిరిమానోత్సవానికి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతునే ఉంది. గతంలో ఒక్క వారమే జాతర జరిగేది. అనంతరం మారు వారం, మూడో వారం భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం పది వారాల వరకు అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.

అమ్మవారికి రెండు గుడులు

శంబర పోలమాంబకు గోముఖీ తీరంలో తూర్పు, పశ్చిమ తీరాన రెండు గుడులు ఉండడం విశేషం. శంబర పోలమాంబ జాతర సుమారు నాలుగు వందల ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. తొలుత పోలమాంబకు ఎటువంటి ఆలయం లేదు. గ్రామంలో ఘటాలకు, వనం గుడి వద్ద ఆమె భూ ప్రవేశం చేసిన ఉన్న చెట్టుకు భక్తులు పూజలు చేసేవారు. జాతర మాత్రం ఏటా చేసేవారు. అయితే 38 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన గ్రంధి సింహాచలం గ్రామస్థుల సహకారంతో.. పోలమాంబ భూ ప్రవేశం చేసిన చోట గుడిని నిర్మించారు. దీంతో గ్రామంలో ఘటాలు ఉంచే పాకలో సైతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో గుడి, విగ్రహాం ఏర్పాటు చేశారు.

పోలమాంబ నేపథ్యం

గిరిజన కొండదొర పేకాపు అప్పన్నదొర దంపతులకు పోలమాంబ ( పోలేశ్వరి ) జన్మించింది. ఆమె ఎవరి కంట పడకుండా ఇంట్లో ఉండేది. పెళ్లీడు రాగానే మామిడిపల్లికి చెందిన యువకునితో పాణిగ్రహణం జరిపించారు. పోలమాంబ భర్త గుర్రంపై, మేనత్త పెదపోలమాంబతో కలిసి పోలమాంబ సవారిపై అత్తారింటికి వెళ్తున్నారు. అయితే గోముఖీ నది దాటిన తరువాత పోలమాంబ సవారిని ఆపమని చెప్పి సమీపంలో చెట్ల మధ్యకు వెళ్లింది. ఆమె ఎంతకీ రాకపోవడంతో మేనత్త పెద్ద పోలమాంబ వెళ్లింది. ఆ సమయంలో పోలమాంబ భూ ప్రవేశం చేస్తుండడం చూసింది. దీంతో తాను కూడా వస్తానని చెప్పడంతో ఆమెను సైతం పోలమాంబ తనతో భూ ప్రవేశానికి అనుమతిచ్చింది. నాటి నుంచి పోలమాంబ, పెదపోలమాంబను కుటుంబ సభ్యులు పూజించేవారు. కాగా అమ్మవారి మహత్యంతో భక్తులకు మేలు జరగడంతో ఆమెకు జాతర నిర్వహించడం ప్రారంభించారు. చెముడు జమీందారు మాన్యాలు ఇచ్చారు. ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రాకముందు భక్తులు సైతం పెద్దమొత్తంలో కానుకలు భూములిచ్చారు.

పోతికోడెరాళ్లు

శంబర పోలమాంబ పోతికోడెరాళ్లుగా సైతం గ్రామస్థుల నుంచి పూజలందుకుంటుంది. శంబర సమీపంలో ఉన్న గుడాం కొండపై చెరువు చదునుకు గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఏరు ( అరక ) తీసుకురావాలని జమిందారు ఆజ్ఞాపించారు. అయితే ఎద్దులు లేకపోవడంతో పేకాపు అప్పన్నదొర కుటుంబీకులు చింతించారు. వారికి కలలో అమ్మవారు కనబడి ఎద్దులుగా తాను, మేనత్త పెదపోలమాంబ వస్తామని అరక పూయండని చెప్పింది. ఉదయం లేచి చూడగా పెరటిలో రెండు ఎద్దులు ఉన్నాయి. వాటితో అరకను తీసుకెళ్లగా చూసేవారికి పులులతో పాటు పాము వస్తున్నట్టు కనిపించడంతో రైతులు పరుగులు తీశారు. అరకను వెనుకకు తీసుకెళ్లమని అంతా ప్రార్థించారు. ఆ తర్వాత పోలమాంబ, పెదపోలమాంబలు కొండపై పోతికోడెరాళ్లుగా మారారు. ఇప్పటికి పంట తొలకరి ఏరువాక సందర్భంగా పోతికోడెరాళ్లుకు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.

Updated Date - Jan 22 , 2024 | 12:33 AM