Share News

అర్జీలకు మోక్షం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:43 PM

ఈ వాఖ్యలతో ప్రభుత్వ అధికారులు మేల్కొన్నారు. నిజంగా సంతృప్తి స్థాయిలను పెంచే ప్రయత్నం చేస్తోన్నారు.

 అర్జీలకు మోక్షం
విశాఖపట్నంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాకు చెందిన మండల స్థాయి అధికారులు (ఫైల్‌)

- శాఖల వారిగా మండల స్థాయి ఉద్యోగులకు శిక్షణ

- ఎస్‌.కోట, విజయనగరం మండలాల ఎంపిక

- ఫిర్యాదుదారులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం చర్యలు

- ఎక్కడో ఢిల్లిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బాగోలేదని చెప్పారు. కానీ, అధికారులు మాత్రం అద్భుతంగా పరిష్కరిస్తున్నామని తప్పుడు లెక్కలతో ప్రజెంటేషన్‌లు ఇచ్చారు. లేని సంతృప్తి స్థాయిలను సృష్టించి, ప్రభుత్వ కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నించారు. ఇలాయితే ప్రజల్లో మాపై నమ్మకం సడలిపోదా.?

- ఇటీవల అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

శృంగవరపుకోట డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఈ వాఖ్యలతో ప్రభుత్వ అధికారులు మేల్కొన్నారు. నిజంగా సంతృప్తి స్థాయిలను పెంచే ప్రయత్నం చేస్తోన్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులను నిర్దిష్టకాలంలో పరిష్కరించేందుకు శాఖల వారిగా శిక్షణ ఇచ్చే పనిలో పడ్డారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్న శృంగవరపుకోట, విజయనగరం మండలాలను ఎంపిక చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలోనూ ఈ రెండు మండలాలు వెనుకబడి ఉన్నాయి. దీంతో ఈ మండలాలకు చెందిన రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పశుసంవర్థక, ఫిషరీస్‌, సర్వశిక్షఅభియాన్‌, విద్యాశాఖ, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌, స్త్రీశిశు సంక్షేమశాఖ, డీఆర్‌డీఏ, జలవనరుల శాఖ, జిల్లా పరిషత్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, గృహా నిర్మాణ శాఖ, సాంఘీక సంక్షేమశాఖ, రవాణా, విద్యుత్‌ వంటి 29 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులకు ఈ నెల 20న విశాఖపట్నంలోని ఏపీహెచ్‌ఆర్‌డీఐలో అవగాహన కల్పించారు. అధికారులకు అందిన ప్రతి ఫిర్యాదును జావాబుదారితనంతో ఎలా పరిష్కారించాలో ఇక్కడ వివరించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారానికి ఉన్న అడ్డంకులను అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలో అవగాహన కల్పించారు. ఇతర శాఖలకు వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు పంపించాలే తప్ప, బుట్టదాఖలు చేయకూడదని దిశనిర్దేశం చేశారు. అర్జీదారుని చిరునామా, ఫోన్‌ నెంబర్‌ ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. సమస్య పరిష్కారంతో కలిగిన సంతృప్తి, పరిష్కారం చేయలేకపోతే దానికి గల కారణాలు, వాటిని అధిగమించే సూచనలను ఇవ్వడం ద్వారా కలిగిన అర్జీదారుల సంతృప్తిని నమోదు చేయాలని శిక్షణలో పేర్కొన్నారు. ఇలా ప్రభుత్వంలో సంతృప్తి స్థాయిలను పెంచేందుకు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.

అధికారుల్లో పట్టుదల..

గత వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం పేరుతో దరఖాస్తులు స్వీకరించేది. వీటికి పరిష్కారం చూపడం అటుంచి, తిరిగి సమస్యలను సృష్టించేది. దీంతో ప్రజలు పలు రకాలుగా ఇబ్బందులు పడ్డారు. జగన్‌ సర్కారు మాదిరిగా కాకుండా ప్రజల వినతులకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వం భావించి మీ కోసం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కలెక్టర్‌, ఎస్పీ, నియోజకవర్గ, మండల స్థాయి కార్యాలయాలతో పాటు పార్టీ కార్యాలయాల్లోనూ మీ కోసం కార్యక్రమం నిర్వహించేవారు. సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించడంతో పాటు తప్పనిసరిగా వారి ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ దరఖాస్తుపై నమోదు చేసేలా చర్యలు తీసుకునేవారు. అంతే, అప్పటినుంచి కుప్పలు తెప్పలుగా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఈ ఫిర్యాదులను ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అధికారులు పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ, పరిష్కరించినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు. ప్రజల సంతృప్తి స్థాయి చాలా ఎక్కువ ఉందని ప్రభుత్వం వద్ద నమ్మబలుకుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి మోదీ చెప్పిన విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. నిజంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మండల స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వరకు శిక్షణలు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా సమస్యలను పరిష్కరించాలన్న పట్టుదల జిల్లా అధికారుల్లో ప్రస్తుతం కనిపిస్తుంది.

Updated Date - Dec 22 , 2024 | 11:43 PM