Share News

మాటిచ్చారు.. మరిచారు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:18 PM

‘వైసీపీ అధికారంలోకి రాగానే.. మన్యం జిల్లాకు కల్పతరువైన జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తాం.. పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.’ అని గత ఎన్నికల సమయంలో పార్వతీపురంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ఒక్కసారి కూడా జంఝావతి ఊసెత్తలేదు.

మాటిచ్చారు.. మరిచారు
జంఝావతి ప్రాజెక్టు

పనులు పూర్తిచేస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ

అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ముఖ్యమంత్రి

గాలిలో కలిసిన ఎత్తిపోతల పథకం

ఏటా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/గరుగుబిల్లి)

‘వైసీపీ అధికారంలోకి రాగానే.. మన్యం జిల్లాకు కల్పతరువైన జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తాం.. పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.’ అని గత ఎన్నికల సమయంలో పార్వతీపురంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ఒక్కసారి కూడా జంఝావతి ఊసెత్తలేదు. ఐదేళ్ల కాలంలో వాటి పనులపై దృష్టిసారించలేదు. ప్రాజెక్టుకు ఒడిశాతో ఉన్న వివాదాలను కూడా పరిష్కరించలేకపోయారు. మొత్తంగా సీఎం జగన్‌ రైతులకు ఇచ్చిన హామీని నీటి మూటగానే మారింది. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని గొప్పలు చెప్పుకునే జగన్‌.. నాటి పాదయాత్రలో ఇచ్చిన హామీని పూర్తిగా మరిచి ఆయకట్టుదారులకు నిరాశే మిగిల్చారు.

ఇదీ పరిస్థితి..

జిల్లా పరిఽధిలోని గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం, పార్వతీపురం మండలాల్లో సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే ఒడిశాతో ఉన్న వివాదం తేలకపోవడంతో ప్రాజెక్టు మిగులు పనులు ముందుకు సాగలేదు. ప్రాజెక్టుకు గేట్లు అమర్చి ప్రస్తుతం రబ్బర్‌ డ్యామ్‌ ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా మూసేస్తే 24 వేల ఎకరాలకు సాగునీరు అందిందొచ్చు. కానీ ఒడిశా రాష్ట్రంలో అటవీ ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. మరోవైపు జంఝావతి ద్వారా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి 10 డిస్ర్టిబ్యూటరీ కాలువ ద్వారా సాగునీరు అందించే ఏర్పాటు చేశారు. అయితే 9 వేల ఎకరాల మించి సాగునీరు అందడం లేదు.

- ఈ ప్రాజెక్టు పరిధిలో కాలువల నిర్వహణకు కూడా వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. కాలువల తవ్వకాలు పూర్తి చేసినప్పటికీ వాటిని అనుసంధానం చేసే పనులు ఇంకా ప్రారంభించలేదు. 6.4 మీటర్లు బెడ్‌ విడ్త్‌ ఉండాల్సిన కాలువలు 2.5 మీటర్లు మాత్రమే ఉన్నాయి. పూర్తిస్థాయిలో తవ్వితే కొంతవరకు పొలాలకు సాగునీరు చేరే వీలుంది. అయితే ఐదేళ్ల పాలనలో వైసీపీ సర్కారు ఆ పనులేవీ చేపట్టలేదు.

- కొమరాడ మండలం గంగభద్ర వద్ద కాలువ భారీ లోతుగా ఉండడంతో ఎక్కడనుంచే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇక చెరువులకు, కాలువలను అనుసంధానిస్తే వేల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంది. పార్వతీపురం మండలం పెద్దండపల్లి, తామరచెరువు నింపితే సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరును అందించొచ్చు. ఇదే మండలంలో తాళ్లబురిడి వద్ద సాకిగడ్డకు అక్వాడెక్ట్‌ నిర్మిస్తే మక్కువ మండలానికి సాగునీరును అందించవచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం జంఝావతిపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇచ్చిన హామీని పూర్తిగా మరిచి.. కనీస స్థాయిలో పనులు చేయకుండా రైతులకు కన్నీళ్లే మిగిల్చింది.

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. కాలువలు, డ్రాపులు, ఆక్విడెక్టులతో పాటు పలు సౌకర్యాలకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు అవసరమైన కాలువలు నిర్మించారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఎత్తిపోతల పథకం మూలకు చేరింది. సకాలంలో బిల్లుల చెల్లింపులు చేయలేదు. దీంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో శివారు భూములకు ఏటా సాగునీరందడం లేదు.

- స్థానిక వనరులను ఉపయోగించుకుని జంఝావతి ద్వారా సాగునీరు అందించేందుకు గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.36 కోట్లను కూడా రద్దు చేసింది. రీ టెండరింగ్‌ పేరిట వైసీపీ ప్రభుత్వం ఆ పనులేవీ చేపట్టలేదు.

- ఎత్తిపోతల పథకం మంజూరు చేసి రైతులకు జంఝావతి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందిస్తామని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పలు దఫాలు హామీ ఇచ్చారు. ఒక దఫా ఎమ్మెల్యేగా, మరో దఫా ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఆమె ఉన్నప్పటికీ మండలంలోని సమస్యలపై అంతగా స్పందించలేదు. జంఝావతి అధికారులు ఉల్లిభద్ర, సీతారాంపురంలోని ప్రాంతాన్ని పరిశీలించి రూ.5 కోట్లతో ఎత్తిపోతల పథకం కోసం ప్రతిపాదనలు చేసినా.. కార్యరూపం దాల్చలేదు. గతంలో ఎత్తిపోతల పథకం ద్వారా ప్రత్యేకంగా విద్యుత్‌ ఉప కేంద్రం ఏర్పాటు చేసినా దాని నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యుత్‌ పనులు చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించలేదు.

- జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువ నుంచి సాగునీరందక భూములు బీడు భూముల్లా మారుతున్నాయి. పలు గ్రామాలకు చెరువులు లేకపోవడంతో కాలువపైనే రైతులు ఆధారపడాల్సిన వస్తోంది. అయితే పూర్తిస్థాయిలో దాని నుంచి నీరందకపోవడంతో ఏటా వారు వరుణుడిపైనే భారం వేసి సాగు చేపట్టాల్సి వస్తోంది.

నిధుల కేటాయింపు ఇలా..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జంఝావతి ప్రాజెక్టుకు అరకొరగానే నిధులు కేటాయించింది. 2018-2019లో రూ. 30 లక్షలు, 2020-21లో రూ. రెండు లక్షల 25 వేలు, 2021-22లో రూ. ఐదు లక్షలు, 2022-23లో రూ.ఆరు లక్షలు మాత్రమే మంజూరు చేశారు. ఈ నిధులతో జంఝావతి ప్రాజెక్టు పనులు ఎలా పూర్తి చేస్తారో సర్కారుకే తెలియాల్సి ఉంది.

ఒడిశా సీఎంతో సమావేశమైనా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ ఒక్కసారి మాత్రమే ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. కానీ జంఝావతి ప్రాజెక్టు వివాదం మాత్రం తేలలేదు. కానీ స్థానిక వైసీపీ నేతలు మాత్రం జంఝావతి ప్రాజెక్టు కోసమే సీఎం జగన్‌ ఒడిశా సీఎంతో సమావేశమైనట్లు గొప్పలు చెప్పుకున్నారు. మొత్తంగా వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా జంఝావతి పరిధిలో ఆయకట్టుదారులు ఏటా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైతులను మోసగించారు

ఎత్తిపోతల పథకం మంజూరు విషయంలో రైతులను మోసగించారు. హామీలే తప్ప నేటికీ ఆ సమస్య పరిష్కరించలేదు. ఖరీఫ్‌ సమయంలో జంఝావతి నుంచి సాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డాం. వర్షాధారంపైనే సాగు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఎత్తిపోతల పథకం కలగా మారింది. ప్రభుత్వం మారితే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయి.

- వావిలిపల్లి దివాకర్‌, ఉద్దవోలు, గరుగుబిల్లి మండలం

=======================

సాగు చేపట్టలేని పరిస్థితి..

జంఝావతి నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడంతో గత ఐదేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. సుమారు 6 వేల ఎకరాల పరిధిలో రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ వైసీపీ సర్కారు స్పందించపోవడం దారుణం.

- మరడాన తవిటినాయుడు, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉల్లిభద్ర

Updated Date - Apr 25 , 2024 | 11:18 PM