Share News

ఎస్‌.కోట లలితకుమారికే

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:57 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీనియార్టీకే అవకాశం కల్పించారు. శృంగవరపుకోట శాసన సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి పేరును శుక్రవారం ఉదయం ప్రకటించారు.

 ఎస్‌.కోట లలితకుమారికే
ఎస్‌.కోట దేవిబోమ్మ కూడలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సంబరాలు

-సీనియార్టీకే అవకాశం ఇచ్చిన అధిష్ఠానం

-నాలుగోసారి పోటీకి దిగుతున్న కోళ్ల

-సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు

శృంగవరపుకోట, మార్చి 22: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీనియార్టీకే అవకాశం కల్పించారు. శృంగవరపుకోట శాసన సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి పేరును శుక్రవారం ఉదయం ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ప్రవాస భారతీయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఈ నియోజకవర్గ టిక్కెట్‌ను ఆశించారు. పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఈ నియోజకవర్గ టిక్కెట్‌ను తేల్చకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొన్నారు. ఎవరికి టిక్కెట్‌ వస్తుందో తెలియక అయోమయానికి గురయ్యారు. చివరకు లలిత కుమారి పేరును ఖరారు చేయడంతో అధిష్ఠానం సీనియార్టీని గుర్తించినట్లయింది. ఈమె నాలుగోసారి బరిలో దిగుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో గిరిజన నియోజకవర్గంగా ఉన్న శృంగవరపుకోట జనరల్‌గా మారింది. దీంతో 2009లో తొలిసారిగా శాసనసభకు టీడీపీ నుంచి ఆమె పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లుకేశవ వెంకట జోగినాయుడుపై 3,440 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి టీడీపీ టిక్కెట్‌ దక్కించుకుని వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై 28,572 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికలో మూడో సారి సీటు పొందినప్పటికి వైసీపీ ఒక్క అవకాశం నినాదంతో వీచిన గాలితో ఈ పార్టీ అభ్యర్థి కడుబండి రఽశీనివాసరావుపై 11,365 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు నాలుగో సారి పార్టీ అవకాశం ఇవ్వడంతో బరిలో దిగుతున్నారు. ఇప్పటికే వైసీపీ కడుబండి శ్రీనివాసరావుకు టిక్కెట్‌ ఖరారు చేయడంతో ఇద్దరి మధ్య పోటీ జరగనుంది.

టీడీపీతో సుదీర్ఘ అనుబంధం

కోళ్ల లలితకుమారి కుటుంబానికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ కుటుంబం 1962 నుంచి శాసన సభకు పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. లలితకుమారి భర్త కోళ్ల బుచ్చిఅప్పలరామప్రసాద్‌ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. ఈమె తాత, మామ కోళ్ల అప్పలనాయుడు పార్టీ అవిర్భావం నుంచి ఉత్తరాపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడిగా 1985, 1989, 1994, 1999 వరకు వ్యవహరించారు. అంతకు ముందు 1962 రేగిడి నియోజకవర్గం నుంచి, 1967 శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసన సభలో అడుగెట్టారు. స్వర్గీయ ఎన్‌టీ రామారావు మంత్రి మండలిలో దేవదాయ, ధర్మాదాయ శాఖా మంత్రిగాను పని చేశారు. ఇతని వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లలిత కుమారి ఇంటర్మీడియట్‌ వరకు చదవుకున్నారు. 2006నుంచి2009 వరకు లక్కవరపుకోట మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలిగా, 2009 నుంచి 2012 వరకు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పని చేశారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రెండు దపాలు తిరుమలతిరుపలి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు.

నియోజకవర్గంలో సంబరాలు

కోళ్ల లలితకుమారికి టీడీపీ టిక్కెట్‌ ఖరారుకావడంతో నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎస్‌.కోటలోని దుర్గామాతకు పార్టీ మండల అధ్యక్షుడు జీఎస్‌ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. దేవి బోమ్మ కూడలిలో బాణసంచా కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌, విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కొణదం మల్లేశ్వరరావు, రెడ్డి వెంకన్న, కాపుగంటి శ్రీనివాసరావు, చెక్క కిరణ్‌ కుమార్‌, పెదగాడి రాజు, వాకడ భరత్‌, చినబాబు, గన్ను బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:57 PM