ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:35 AM
ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోలకు చెందిన కొత్త బస్సులను ప్రారంభించారు.

పార్వతీపురం/పార్వతీపురం టౌన్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోలకు చెందిన కొత్త బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ... ఆర్టీసీలో సమర్థవంతంగా పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులకు సర్కారు అండగా ఉంటుందన్నారు. నైట్‌ఔట్ విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు అదనపు వేతనం ఇచ్చే విధంగా ఇప్పటికే ప్రత్యేక జీవో విడుదల చేసినట్లు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా మన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. జిల్లాలో ఆర్టీసీ డిపోలను ఏక కాలంలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. త్వరలో ఎలక్ర్టికల్ బస్సు సర్వీసు సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. వాటిల్లో డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. ఆ తర్వాత ఉత్తమ కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లకు ప్రశంసాపత్రాలను అందజేశారు. చిన్న చిన్న తప్పులకు కార్మికులు, ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం, సస్పెన్షన్ చేయడం సరికాదన్నారు. దీనిపై అధికారులు పునరాలోచించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పార్వతీపురం మన్యం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అద్భుతమైన విజన్‌తో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్రతో కలిసి బస్సులో జిల్లా కేంద్రమంతా తిరిగారు. తన తండ్రి గతంలో కండక్టర్‌గా పనిచేశారని ఈ నేపథ్యంలో ఆర్టీసీతో విడదీయలేని బంధం ఉందని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ విజయ్‌కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, పార్వతీపురం డీఎం దుర్గా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు సీతారామ, వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అధునాతన క్రీడా ప్రాంగణం నిర్మాణానికి సంబంధించి మంత్రి భూమి పూజ చేశారు. ఇటువంటి క్రీడా ప్రాంగణాల వల్ల ఉత్తమ క్రీడాకారులు తయారు అవుతారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో క్రీడా వికాస కేంద్రం నిధులతో దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరీ తదితరులు పాల్గొన్నారు. - సీతానగరం: మండల కేంద్రంలోని హనుమాన్ కూడలిలో బస్ షెల్టర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. - పార్వతీపురం రూరల్: నర్సిపురం వద్ద ఆర్టీసీ డ్రైవింగ్ ట్రాక్ పనులకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.