Share News

ఫ్లైఓవర్‌ ఆగిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:29 PM

జిల్లా కేంద్రంలోని ఫ్ల్లైఓవర్‌పై ఓ ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది.

ఫ్లైఓవర్‌ ఆగిన ఆర్టీసీ బస్సు
ఫ్లైఓవర్‌పై బస్సు ఆగిపోవడంతో ఇరువైపులా స్తంభించిన ట్రాఫిక్‌

- భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

- పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇంటర్‌ విద్యార్థుల పాట్లు

పార్వతీపురం టౌన్‌, మార్చి 11: జిల్లా కేంద్రంలోని ఫ్ల్లైఓవర్‌పై ఓ ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనచోదకులు, పాదచారులతో పాటు ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పార్వతీపురం నుంచి పాలకొండకు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరిగ్గా ఫ్లైఓవర్‌పైకి వచ్చేసరికి సాంకేతిక సమస్య తలెత్తి రహదారి మధ్యలో ఆగిపోయింది. దీంతో అటు, ఇటుగా వెళ్లేందుకు భారీ, ద్విచక్ర వాహనాలకు, పాదచారులకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఫ్లైఓవర్‌కు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనివల్ల వాహనచోదకులు, పాదచారులతో పాటు వివిధ గ్రామాల నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇంతలో ట్రాఫిక్‌ పోలీసులు రంగప్రవేశం చేసి ఆగిపోయిన బస్సును పాదచారులతో కలిసి ముందుకు నెట్టారు. అనంతరం ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 11:29 PM