రోడ్డెక్కిన పెన్షనర్లు
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:59 PM
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
- సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
బెలగాం, జనవరి 29: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఇంతవరకు ఎప్పుడూ పెన్షనర్లు ధర్నాలు చేయలేదని, కానీ ఈ ప్రభుత్వ చర్యలతో నేడు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. పెండింగ్‌లో డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 10వ పీఆర్సీలో తగ్గించిన అడిషినల్ క్వాంటమ్‌ను తిరిగి యథావిధిగా పునరుద్ధరించాలని, ఎరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్రంలోని పెన్షనర్లు దాదాపు రూ.87 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నా ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీంతో హెల్త్ కార్డుల ద్వారా వైద్యం చేయడానికి కార్పొరేట్ ఆసుప్రతులు అంగీక రించడం లేదన్నారు. గుర్తింపుపొందిన అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడుతామని పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణపతిరావు హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున వచ్చిన ి పెన్షనర్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు.