Share News

రాజీనామా చేయండి

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:54 PM

వలంటీర్లంతా రాజీనామాలు చేసెయ్యాలని వైసీపీ నాయకులు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. అస్తమానం వారి ఫోన్లకు మెసేజ్‌లు పెడుతున్నారు.

రాజీనామా చేయండి

బొబ్బిలి/ రామభద్రపురం, ఏప్రిల్‌ 2: వలంటీర్లంతా రాజీనామాలు చేసెయ్యాలని వైసీపీ నాయకులు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. అస్తమానం వారి ఫోన్లకు మెసేజ్‌లు పెడుతున్నారు. అప్పటికీ వినకుంటే వారి కుటుంబ సభ్యులు, బంధువులతో చెప్పిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తోచక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక వలంటీర్లు ఒత్తిడికి గురవుతున్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారి మెడపై కత్తి పెట్టినట్లు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఫీల్డు ఆపరేషన్‌ ఏజెన్సీ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ ఒత్తిడి విపరీతంగా ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ చెప్పినట్లు చేయాలా? లేక మిన్నకుండి పోవాలా? అని మథనపడుతున్నారు. ఎన్నికల్లో వారిని అన్ని విధాలా ఉపయోగించుకోవాలని నాయకులు వ్యూహాం పన్నారు. వలంటీర్ల కు ఉన్న పరిచయాలతో ఓట్లు దండుకునే ప్రణాళిక రచించారు. ఇప్పటికే దుస్తులు, డబ్బులు తదితర తాయిలాలు అందజేశారు. వీటిని తీసుకోవడం కొందరు వలంటీర్లకు ఇష్టం లేకపోయిన ప్పటికీ రాజకీయ పరమైన వైరం వస్తుందేమోనని భయపడి తీసుకున్నారు. రాజీనామాలను వారు ఏమాత్రం ఇష్టపడడం లేదు. దీనిపై వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వలంటీర్ల వ్యవస్థపై ఇచ్చిన భరోసా నమ్మశక్యంగానే ఉందని, వారు అధికారంలోని వస్తే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రజావాణి చూస్తే ప్రభుత్వం పట్ల సానుకూలత లేదని, భవిష్యత్‌లో మేలు జరుగుతుందని అనుకోలేమని బొబ్బిలికి చెందిన ఓ వలంటీరు చెప్పాడు. కరడుగట్టిన కార్యకర్తల్లాంటి వలంటీర్లు మినహా మిగిలిన వారంతా వలంటీరు పోస్టులను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వలంటీర్లకు భవిష్యత్‌ ఉండకపోవచ్చుననేది వారి భావన. తామంతా పేదలమని, కేవలం ఐదువేల రూపాయలకు పనిచేస్తున్నామని, రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురిచేయవద్దు అంటూ చాలా మంది వలంటీర్లు విన్నవించుకుంటున్నారు.
- రాజీనామా చేసివవారు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని రామభద్రపురం మండలంలో కొందరు వలంటీర్లకు మెసేజ్‌లు వచ్చాయి. రాజీనామాకు ముందుకు రాని వారి పట్ల పరుషంగా మాట్లాడుతున్నారని సమాచారం. తామే పోస్టులు వేశాం, చెప్పినట్టు రాజీనామా చేయాలంటున్నారు. వలంటీర్లు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:54 PM