పార్లమెంట్ సమావేశాలను తలపించేలా..
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:33 PM
గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం ఆకట్టుకుంది. పార్లమెంట్ సమావేశాలను తలపించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం ఆకట్టుకుంది. పార్లమెంట్ సమావేశాలను తలపించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణను పార్లమెంట్ హాల్ మాదిరిగా మార్చారు. బెంచీలను ఏర్పాటు చేసి ఒకవైపు అధికార పక్ష సభ్యులు (విద్యార్థులు), మరోపక్క ప్రతిపక్ష సభ్యులు(విద్యార్థులు) కూర్చున్నారు. స్పీకర్‌గా శివానంద్ (థర్డ్ ఎంపీసీఎస్) విద్యార్థి పార్లమెంట్ శీతాకాల సమావేశం ప్రారంభించారు. ప్రధానమంత్రిగా కుమారి పద్మిని (సెకెండ్ సీబీజెడ్) విద్యార్థిని సభాపతికి నమస్కరించి ఉపన్యాసం ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో తరుణ్(సీబీజెడ్) విద్యార్థి అధికార పక్షానికి ఊపిరి సలపనీయకుండా ప్రశ్నలు సంధించారు. కేంద్ర మంత్రులుగా వ్యవహరించిన కొందరు విద్యార్థులు తమ సమాధానాలతో ప్రతిపక్షం నోరు మూయించారు. అనంతరం ప్రతిపక్షం వాకౌట్ చేసి బయటకు రావడంతో.. సభాపతి శివానంద్ అధికార పక్షంతో సమావేశాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యంతం ఆకట్టుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీవరం, వైస్ ప్రిన్సిపాల్ రామయ్య, ఐక్యూఏసీ కల్పన, అధ్యాపకులు స్వరూప, సింహాచలం, కుమారి, శ్రీవాణి, కృష్ణ, అన్ని గ్రూప్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.