Share News

నేడే విడుదల

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:23 AM

ఎన్నికల ప్రధాన ఘట్టానికి కొద్ది గంటల్లో కీలక అడుగు పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడే విడుదల

నేడే విడుదల

ఎన్నికల ప్రధాన ఘట్టానికి కొద్ది గంటల్లో శ్రీకారం

నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే నామినేషన్ల స్వీకారం

అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు

విజయనగరం కలెక్టరేట్‌లో ఎంపీ నామినేషన్లు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ప్రధాన ఘట్టానికి కొద్ది గంటల్లో కీలక అడుగు పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి కలెక్టరేట్‌లో నామినేషన్లు అందజేస్తారు. నామినేషన్లు వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి వద్దకు అనుమతిస్తామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రకటించారు. మిగిలిన వారు 100మీటర్ల దూరంలో ఉండాలి. మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ల పత్రాలు దాఖలు చేయవచ్చు. ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో గరిష్టంగా పోటీ చేసే వీలుంది.

- పోటీ చేసే అభ్యర్థులు అసెంబ్లీకి రూ.10వేలు, పార్లమెంట్‌కు రూ.25వేలు ధరావతు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా అభ్యర్థుల ఊరేగింపులు, నామినేషన్ల దాఖలు చేసేటపుడు పూర్తిగా రికార్డింగ్‌ చేస్తారు.

- అభ్యర్థులు 13రకాల డాక్యుమెంట్లు తీసుకురావాలి. నామినేషన్లను ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్‌ స్వీకరణ ఉండదు. నామినేషన్లను అభ్యర్థి నేరుగా కాని, తను సూచించిన వ్యక్తి ద్వారా కాని సమర్పించవచ్చు. నామినేషన్‌తో పాటు కొత్తగా తెరిచిన బ్యాంక్‌ ఖాతాను ఇవ్వాలి. నామినేషన్ల స్వీకరణకు ఒక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తారు. సువిధ యాప్‌ ద్వారా కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చు. కాని హోర్డ్‌ కాపీలను ఆర్‌వోకు అందించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

- 18న గురువారం ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

- 25 వరకు నామినేషన్ల స్వీకరణ

- 26న నామినేషన్ల పరిశీలన

- 29న నామినేషన్ల ఉపసంహరణ

- మే 13న పోలింగ్‌

- జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

---------

Updated Date - Apr 18 , 2024 | 12:23 AM