Share News

రాజాం...ప్రత్యేకతల సంగమం!

ABN , Publish Date - May 03 , 2024 | 11:54 PM

రాజాం.. ఎన్నో ప్రత్యేకతల సంగమం...ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం. చారిత్రక ప్రదేశాలు, విశిష్ట వ్యక్తులు, వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. కళాకారులు, కర్రతో నగల తయారీదారులకు కొలువైన ప్రాంతం.

రాజాం...ప్రత్యేకతల సంగమం!

- చారిత్రక ప్రదేశాలు

- విశిష్ట వ్యక్తులు

- వింతలు, విశేషాల కలబోత

రాజాం రూరల్‌: రాజాం.. ఎన్నో ప్రత్యేకతల సంగమం...ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం. చారిత్రక ప్రదేశాలు, విశిష్ట వ్యక్తులు, వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. కళాకారులు, కర్రతో నగల తయారీదారులకు కొలువైన ప్రాంతం. సాముగరిడీలలో ఆరితేరిన వారు. సాగునీటి వనరులు.. ఇలా ఎన్నో విశేషాల సమాహారం.

ఎన్నో ప్రత్యేకతలు

ఈ నియోజకవర్గంలోని విశేషాలను పరిశీలిస్తే.....కాశీ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న త్రివేణి సంగమం వంగర మండలం సంగాం గ్రామ పరిసరాల్లో ఉంది. నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు ఇక్కడే కలుస్తాయి. త్రివేణి సంగమంలో స్నానం చేసి.. శివాలయంలో పూజలు చేస్తే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నంత ఫలితమని ప్రజల నమ్మకం.

ఈ మండలం మడ్డువలస ప్రాజెక్టును ఆనుకొని ఉన్న కొండపై పాండవుల పంచ ఉంది. వనవాసం సమయంలో ఇక్కడే పాండవులు ఉన్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురంలో సీతారామాలయం ప్రసిద్ధికెక్కింది. అయిదు శతాబ్దాల క్రితం బొబ్బిలి రాజులు నిర్మించిన ఈ ఆలయంలో ఏకశిలపై చెక్కిన సీత, రాముడు, ఆంజనేయుడి విగ్రహం 15వ శతాబ్దం నాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడి శిల్పకళా సంపద సందర్శకులను పరవశింపజేస్తుంది.

- ఇదే మండలం సిరిపురం గ్రామంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తామరచెరువు జిల్లాలోనే అతి పెద్దది.

- రాజాం పట్టణంలోని నవదుర్గ అమ్మవారి ఆలయం దేశంలోనే ఏకైక ఆలయం. తొమ్మిది మంది దుర్గలతో కూడిన ఆలయం దేశంలో మరెక్కడా లేదు.

- ఇక్కడే వెలిసిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య ధైవంగా వెలుగొందుతోంది. ఈ మండలం రాజయ్యపేటలోని వరదరాజ స్వామి ఆలయం వందల ఏళ్ల క్రితం నిర్మించారు.

విశిష్ట వ్యక్తులు ఇక్కడివారే..

- ప్రపంచ పారిశ్రామిక చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గ్రంధి మల్లికార్జునరావుది (జి.ఎం.ఆర్‌.) రాజాం.

- బీహార్‌ ఎన్నికలలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కేంద్ర ఎన్నికల మాజీ సలహాదారు కె.జె.రావు స్వగ్రామం రేగిడి మండలం కొండల మామిడివలస.

- హైకోర్డు న్యాయమూర్తిగా పనిచేసిన దివంగత కొత్తపల్లి పున్నయ్యది సంతకవిటి మండలం కావలి గ్రామం.

- ప్రత్యేకమైన చెక్కతో ఆభరణాలు తయారుచేసే నిపుణులు మండలం పనసలవలసలో ఉండేవారు. పౌరాణిక నాటకాలలో నటులు వీటిని వేసుకునేవారు. రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాల ప్రాముఖ్యం పెరగడంతో వృత్తికి వీరు దూరమయ్యారు.

- తానీషా ఆస్థానంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్న పేర్లతో రేగిడి మండలంలో అక్కన్న అగ్రహారం, మాధవ రాయపురం గ్రామాలు ఉన్నాయి.

చారిత్రకంగా..

- బొబ్బిలి రాజుల హయాంలో ఇక్కడి ఠాణావీధిలో నిర్మించిన భవనంలో తాండ్ర పాపారాయుడు ఉండేవారు. ఇదే భవనంలో ప్రత్యేకంగా జైలుగది కూడా ఉంది. పాపారాయుడు మెడలో ధరించే ఆభరణం ఇప్పటికీ భద్రంగా ఉంది.

- బొబ్బిలి రాజులు నివాసం ఉండే కోటలో కోర్టుల సముదాయం ఉండేది. ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

- బొబ్బిలి రాజుల హయాంలోని నిర్మాణాల శిథిలాల ఆనవాళ్లు ఇప్పటికీ రేగిడి మండలం ఉంగరాడ, సంతకవిటి మండలం వావిలవలస, జి.ఎస్‌.పురం గ్రామాలలో ఉన్నాయి.

- జమిందారీ పోరాటానికి ఊపిరిపోసిన సింహాద్రి సూర్యనారాయణ, అప్పన్న సోదరులది రేగిడి మండలం ఆడవరం గ్రామం.

- రాజాం నుంచి చీపురుపల్లి వెళ్లే మార్గంలో ఉన్న జెండాల దిబ్బ ప్రాంతానికి కూడా చారిత్రక నేపఽథ్యం ఉంది. విజయనగరం, బొబ్బిలి రాజులు యుద్ధ సమయంలో ఇక్కడ రెండు రాజ్యాల జెండాలు పాతారని... అందుకే ఈ ప్రాంతానికి జెండాల దిబ్బగా పేరు వచ్చిందని చెబుతారు.

Updated Date - May 03 , 2024 | 11:54 PM