Share News

రాజాం... ఏమిటో ఓటరు మనోగతం!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:13 AM

రాజాం... నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం.. ఇప్పుడు విజయనగరం జిల్లాలో చేరింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. రాజకీయ యుద్ధాలకు పేరుమోసిన ప్రాంతం. పూర్వాశ్రమంలో ఉణుకూరు నియోజకవర్గంగా ఉండేది. 2009లో పునర్విభజనతో రాజాం నియోజకవర్గంగా అవతరించింది. జనరల్‌ స్థానం కాస్తా ఎస్సీ కావడంతో రెండు కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధానికి తెరపడింది.

రాజాం... ఏమిటో ఓటరు మనోగతం!

- ఒకప్పుడు ఉణుకూరు..

- టీడీపీ ఆవిర్భావం తరువాత ఆరు ఎన్నికలు

- అందులో ఐదుసార్లు గెలిచింది తెలుగుదేశమే

- నాలుగుసార్లు సత్తా చాటిన కళా వెంకటరావు

- 2009లో రాజాం ఆవిర్భావం

- ఒకసారి కాంగ్రెస్‌, రెండుసార్లు వైసీపీ విజయం

(రాజాం)

రాజాం... నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం.. ఇప్పుడు విజయనగరం జిల్లాలో చేరింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. రాజకీయ యుద్ధాలకు పేరుమోసిన ప్రాంతం. పూర్వాశ్రమంలో ఉణుకూరు నియోజకవర్గంగా ఉండేది. 2009లో పునర్విభజనతో రాజాం నియోజకవర్గంగా అవతరించింది. జనరల్‌ స్థానం కాస్తా ఎస్సీ కావడంతో రెండు కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధానికి తెరపడింది.

అప్పట్లో ఉణుకూరుగా...

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉణుకూరు నియోజకవర్గం ఉండేది. 1952లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. రాజాం, వంగర మండలాలతో పాటు రేగిడి ఆమదాలవలస మండలంలోని 22 పంచాయతీలతో ఉణుకూరు నియోజకవర్గం సాగేది. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పాలవలస కుటుంబం హవా నడిచింది. ఆ కుటుంబానికి చెందిన పాలవలస రుక్మిణమ్మ, సంగంనాయుడు, రాజశేఖరం కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలుపొందుతూ వచ్చారు. కానీ 1983లో టీడీపీ ఆవిర్భావంతో పాలవలస కుటుంబానికి చెక్‌ పెట్టారు కళా వెంకటరావు. రెండున్నర పదుల వయసులో టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు కళా వెంకటరావు. కిమిడి వెంకటరావుకు ఎన్టీఆర్‌ ‘కళా’ అనే బిరుదును జోడించారు. అప్పటి నుంచి కిమిడి కళా వెంకటరావుగా పేరొందారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కళా వెంకటరావు హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 1994లో మాత్రం పాలవలస రాజశేఖరం చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఒక్క ఉణుకూరు తప్ప అన్ని స్థానాలను టీడీపీ గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాలవలస రాజశేఖరం ఒక్కరే గెలిచారు. ఈ నేపథ్యంలో 1997లో కళా వెంకటరావు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. దీంతో 1999లో ఉణుకూరు నియోజకవర్గం నుంచి కళా వెంకటరావు సోదరుడు కిమిడి గణపతిరావు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2004లో మరోసారి కళా వెంకటరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉణుకూరు కనుమరుగైంది. రాజాం నియోజకవర్గం తెరపైకి వచ్చింది. ఎస్సీలకు రిజర్వ్‌ కావడంతో కళా వెంకటరావు నియోజకవర్గం మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. టీడీపీ ఆవిర్భావం తరువాత 2004 వరకూ ఆరు ఎన్నికలు జరుగగా.. ఐదుసార్లు టీడీపీ గెలవడం... అందులో నాలుగుసార్లు కళా వెంకటరావు గెలవడం విశేషం.

రాజాం ఇలా...

2009లో ఆవిర్భవించిన రాజాం నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఎచ్చెర్ల జనరల్‌గా మారింది. దీంతో అక్కడి నాయకులు ఇక్కడికి... ఇక్కడి నాయకులు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోండ్రు మురళీమోహన్‌ పోటీచేశారు. టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభాభారతిపై 27,133 ఓట్లతో విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా కంబాల జోగులు పోటీచేశారు. టీడీపీ అభ్యర్థిగా కావలి ప్రతిభాభారతిపై కేవలం 512 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో 16,848 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మార్పు ఎవరికి వరమో...

ఈసారి ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులును తప్పించింది. విశాఖ జిల్లా పాయకరావుపేటకు పంపించింది. ఇక్కడ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు డాక్టర్‌ రాజేష్‌ను బరిలో దించింది. టీడీపీ మాత్రం మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు మరోసారి టిక్కెట్‌ కేటయించింది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కలేదు. అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి ఓటరు ఎవరిపై తమ అభిమానాన్ని చూపిస్తారో చూడాలి.

Updated Date - Apr 19 , 2024 | 12:14 AM