వానొస్తే.. అంతే!
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:04 AM
వర్షం కురిస్తే చాలు.. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు కారిపోతున్నాయి. గదుల్లో రికార్డులు, కంప్యూటర్లు తడిచిపోతున్నాయి. గత ఐదేళ్లూ.. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి భవనాలపై దృష్టి సారించలేదు. కనీసం మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయలేదు.

విలువైన రికార్డులు, కంప్యూటర్లకు రక్షణ కరువు
వాటి నిర్వహణపై దృష్టి సారించని గత వైసీపీ ప్రభుత్వం
మరమ్మతులకు నిధులు కూడా మంజూరు చేయని వైనం
పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాలు
బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
ఎప్పుడు కూలుతాయో తెలియని ఆందోళనలో ప్రజలు
( గరుగుబిల్లి/ జియ్యమ్మవలస )
వర్షం కురిస్తే చాలు.. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు కారిపోతున్నాయి. గదుల్లో రికార్డులు, కంప్యూటర్లు తడిచిపోతున్నాయి. గత ఐదేళ్లూ.. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి భవనాలపై దృష్టి సారించలేదు. కనీసం మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఆయా భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బిక్కుబిక్కుమంటూ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వర్షాకాలంలో వారి బాధలు వర్ణణాతీతం. వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరోవైపు వాటి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని గ్రామీణ పశు వైద్యశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయి. కొన్నాళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. శిథిల భవనాల్లో వసతి సమస్య వేధిస్తుండడంతో వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహించలేకపోతున్నారు. జిల్లాలో 38 వరకు పశు వైద్యశాలలు ఉన్నాయి. 35 గ్రామీణ ప్రాంతాల్లో, ఏడు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2.29 లక్షలకు పైగా పశువులు, 2.7 లక్షల గొర్రెలు, సుమారు 1.73 లక్షల మేకలు, 7 లక్షలకు పైగా కోళ్లు, సుమారు 84 వేల పందులు ఉన్నాయి. అయితే వైద్య సేవలందించేందుకు గాను భవనాల సౌకర్యం లేదు. జిల్లాలో సుమారు 15 భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది.
- గరుగుబిల్లి మండలం విషయానికొస్తే.. నాగూరు, గరుగుబిల్లి, ఉల్లిభద్ర, రావివలసతో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. పది ప్రాంతాల్లో సొంత భవనాలు లేవు. దీంతో అద్దె గృహాల్లోనే పశువైద్యశాలలను నిర్వహిస్తున్నారు.
- పార్వతీపురం మండలం ఎమ్మార్ నగరంలో భవనం శిఽథిలావస్థకు చేరుకుంది. మండల స్థాయి ఆసుపత్రి కావడంతో గడ్డి విత్తనాలు, మందులు, దాణా, తదితర సామగ్రిని ఇక్కడ నిల్వ చేయలేకపోతున్నారు.
- కురుపాం మండలంలో పలు పశువైద్యశాలల కిటికీలు, తలుపులకు చెదలు పట్టాయి.
- భామిని, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో పశు వైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి గుమ్మలక్ష్మీపురం పశు వైద్యశాలను శిఽథిలమైన తహసీల్దార్ కార్యాలయ భవనంలోనే నిర్వహిస్తున్నారు.
సిబ్బంది కొరత
జిల్లాలో ప్రతి మండలానికి ఇద్దరేసి చొప్పున వైద్యులు ఉండాల్సి ఉన్నప్పటికీ ఒకరే విధులు నిర్వహిస్తున్నారు. కొమరాడకు సంబంధించి ముగ్గురికి ఒక్క వైద్యుడే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 19 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. పలు మండలాల పరిధిలో వైద్యులతో పాటు దిగువస్థాయి సిబ్బంది కొరత ఉంది. కొన్ని మండలాలకు ఇన్‌చార్జిలే దిక్కు. ఒకవైపు శిథిల భవనాలు, మరోవైపు సిబ్బంది కొరత కారణంగా పాడి రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తుండడంతో శిథిల భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై టీడీపీ కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది. శిఽథిల భవనాలకు మరమ్మతులతో పాటు వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
బయటకు బాగానే ఉన్నా..
జియ్యమ్మవలస మండలంలో కొన్ని ప్రభుత్వ భవనాలు బయటకు మాత్రం బాగానే కనిపిస్తున్నాయి. వర్షం పడితే మాత్రం అధ్వానంగా మారుతున్నాయి. ప్రధానంగా ఎంపీడీవో కార్యాలయంలో దాదాపు గదులన్నీ కారిపోతున్నాయి. శ్లాబు, గోడల నుంచి నీరు కారడంతో కంప్యూటర్లపై టార్పాలిన్లు, ఫ్లెక్సీ బ్యానర్లు కప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ భవనాలకు ఉన్న పిల్లర్లు దాదాపు 80 శాతం శిఽథిలమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుంతో తెలియని పరిస్థితి. అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ఈ భవనంలోనే ఉన్న ఉపాధి హామీ పథక విభాగం మరింత దారుణంగా ఉంది. మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, పశు వైద్య చికిత్సాలయం గోడలు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి. స్లాబు కూడా కొంతమేర కుంగిపోయి ఉంది.
నివేదికలు అందించాం
జిల్లాలోని పశు వైద్యశాలల మరమ్మతులు, సిబ్బంది నియామకంపై ఉన్నతాధికారులకు నివేదికలు అందించాం. శిఽథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాం. నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉన్న వైద్యులతో సేవలు అందిస్తున్నాం.
- మన్మథరావు, జిల్లా పశు వైద్యాధికారి