Share News

క్వింటా రూ.600 నష్టానికే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:21 PM

వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను విక్రయించుకోలేక.. నిల్వ ఉంచలేక తీవ్రంగా సత మతమవుతున్నారు.

క్వింటా రూ.600 నష్టానికే..
విక్రయానికి పత్తిని తూకం చేస్తున్న దృశ్యం

సహకరించని ప్రకృతి.. తగ్గిన దిగుబడి

అందుబాటులో లేని కొనుగోలు కేంద్రాలు

అందని గిట్టుబాటు ధర

సమీపిస్తున్న పండగ

తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు, ప్రైవేట్‌ వ్యాపారుల చెంతకు ..

తీవ్రంగా నష్టపోతున్న వైనం

భామిని: వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను విక్రయించుకోలేక.. నిల్వ ఉంచలేక తీవ్రంగా సత మతమవుతున్నారు. మరోవైపు సంక్రాంతి సమీపిస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. పండగ గట్టెక్కాలంటే.. ఎలాగోలా పంటను విక్రయించాల్సిన పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు కూడా అందుబాటులో లేకపోవడంతో విధిలేక ప్రైవేట్‌ వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా క్వింటాకు రూ.600 నష్టానికి పంటను విక్రయించాల్సి రావడంతో మండల రైతులు లబోదిబోమంటున్నారు.

వాస్తవంగా భామిని మండలంలో ఏటాలానే ఈ సారి కూడా 8వేల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. ఎకరాకు రూ.30 నుంచి 35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే ఈ ఏడాది రైతులకు ప్రకృతి సహకరించలేదు. సరిగ్గా పువ్వు, కాయ దశలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. దీంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఆ ప్రభావం దిగుబడిపై పడింది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రభుత్వం క్వింటా పత్తి ధరను రూ.7,025 నిర్ణయించగా, ఈ ప్రాంతంలో దళారులు క్వింటా రూ.6,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో సుమారు రూ.625 చొప్పున రైతులు క్వింటా వద్ద నష్టపోతున్నారు. అయితే గతేడాది క్వింటా పత్తి ధరను ప్రభుత్వం రూ. 7వేలుగా నిర్ణయించగా, డిమాండ్‌ దృష్ట్యా బయట మార్కెట్లో రైతులు క్వింటా పత్తిని రూ.7,600కు విక్రయించారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. సంక్రాంతి సమీపిస్తుండడం, దళారుల ఒత్తిడి కారణంగా నష్టానికే పంటను విక్రయించాల్సి వస్తోంది. వాస్తవంగా నెలరోజుల కిందటే కొంతమంది వ్యాపారులు నాసిరకం పత్తి అంటూ రైతులను భయపెట్టి కొనుగోలు చేశారు. అయితే ఇంకొంతమంది రైతులు మాత్రం తమ ఇళ్లలో పంటను నిల్వ ఉంచి ఇప్పుడిప్పుడు అమ్మకాలు చేపడుతున్నారు. అయినా వారికి నష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ మార్కెట్లో ధర తగ్గుతుండడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఇదే అనువుగా మహారాష్ట్ర, గుంటూరుకు చెందిన బయ్యర్లు సిండికేట్లుగా మారి స్థానిక దళారులతో చేతులు కలుపుతున్నారు. సంక్రాంతి ముందే రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రం లేక..

మండలంలో భారీ ఎత్తున పత్తి పంట సాగవుతున్నా.. ఈ ప్రాంతంలో అధికారులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఏటా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాజాంలో కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ .. అక్కడకు పంటను తీసుకెళ్లేందుకు రవాణా చార్జీలు రైతులకు భారమవుతున్నాయి. తీరా పత్తిని అక్కడకు తీసుకెళ్తే.. నాణ్యత పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతుండడం పరిపాటిగా మారింది. ఈకేవైసీ, పంట నమోదు లేకుంటే పత్తిని కొనుగోలు చేయడం లేదు. దీంతో ఈసురోమంటూ తిరిగి పత్తిని స్వగ్రామాలకు తీసుకురావడం రైతులకు తలకుమించిన భారంగా మారుతోంది. దీంతో ఏటా వారు స్థానిక దళారులు, ప్రైవేట్‌ వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సి వస్తోంది. కాగా కొనుగోలు కేంద్రానికి వెళ్లిన పత్తి వివిధ కారణాలతో నిర్వాహకులు తీసుకోకుంటే.. బయట మార్కెట్లోనూ వాటిని ఎవరూ క్రయం చేయడం లేదు. రైతులకు ఈ తలనొప్పి కూడా ఉండడంతో అత్యధికులు కొనుగోలు కేంద్రం వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో స్థానికంగానే కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయాధికారి మన్మఽథరావును వివరణ కోరగా.. ఈకేవైసీలో నమోదు చేసి ఉంటే రాజాంలోని కేంద్రంలో క్వింటా రూ.7,025 చొప్పున పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. నలుగురైదుగురు రైతలు కలిసి విక్రయిస్తే సహకరిస్తామని తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 11:21 PM