ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:19 PM
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు నియోజకవర్గం మామిడిపల్లిలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్నీ పలకరించారు.
సాలూరు, సెప్టెంబరు 20: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు నియోజకవర్గం మామిడిపల్లిలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్నీ పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయవంతంగా సాగిందని తెలియజేస్తూ.. కరపత్రాలు, స్టీక్కర్లును పంపిణీ చేశారు. ప్రజా ఉపయోగ పనులు మాత్రమే ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. సీఎం ఆదే శాల మేరకు ప్రజల్లోకి వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడి పోయిందన్నారు. అన్ని రంగాలూ కుదేలైపోయాయని తెలిపారు. రాష్ర్టాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు.. మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. అనంతరం వంద రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ సొమ్ము పెంచిన ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు, 16,437 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్, అన్న క్యాంటీన్ల ప్రారంభానికి చర్యలు చేపట్టిందని వివరించారు. జిల్లాలో జీవనోపాధి కల్పన, పర్యటకం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో రక్త హీనత, మాతా శిశు మరణాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ‘పొలంబడి పిలుస్తోంది’ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. వేదిక వద్ద మహిళలు, చిన్నారులతో కలిసి మంత్రి సరదాగా కోలాటం ఆడారు. అంతకముందు ఆమెపై మామిడిపల్లివాసులు పూలవర్షం కురిపించి హారతులతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో ప్రసూన, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భంజ్‌దేవ్, టీడీపీ నాయకులు అన్నపూర్ణ, తిరుపతిరావు, రమాదేవి, పరమేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
- పార్వతీపురం మండలం ములగ పంచాయతీలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ మండలం ఎల్‌ఎల్ పురంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి శ్రేణులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.