Share News

ప్రజారోగ్యం గాలికి..!

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:17 AM

పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను మంజూరు చేస్తున్నట్లు వైసీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. కానీ మూడేళ్లు గడుస్తున్నా... శాశ్వత భవన నిర్మాణాలను మాత్రం పూర్తి చేయించలేకపోయింది.

ప్రజారోగ్యం గాలికి..!
పాలకొండలో అర్థాంతరంగా నిలిచిపోయిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పనులు

మూడేళ్ల కిందట మంజూరు.. బిల్లులు చెల్లించని సర్కారు

అంతంతమాత్రంగానే పనులు.. అద్దె భవనాల్లోనే కేంద్రాలు

రోగులు, వైద్య సిబ్బందికి తప్పని ఇబ్బందులు

పాలకొండ: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను మంజూరు చేస్తున్నట్లు వైసీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. కానీ మూడేళ్లు గడుస్తున్నా... శాశ్వత భవన నిర్మాణాలను మాత్రం పూర్తి చేయించలేకపోయింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో.. సేవలెప్పుడు అందిస్తాయో? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రస్తుతం జిల్లాలో మూడు చోట్ల అద్దె భవనాల్లోనే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు కొనసాగుతున్నాయి. అయితే చాలీచాలని గదుల్లో వైద్యసేవలు అందిస్తుండడంతో రోగులు, వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక వైద్య పరికరాలు సైతం మూలకు చేరాయి. జిల్లాలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల శాశ్వత భవనాల పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం..

- పాలకొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా నూతన అర్బన్‌ సెంటర్‌కు రూ.80 లక్షలను మూడేళ్ల కిందట మంజూరు చేశారు. నిధులు చాలకపోవడంతో అదనంగా రూ.11 లక్షల మేర కేటాయించారు. అయినప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. ఇప్పటివరకు రూ.55 లక్షల మేర పనులు జరిగాయి. కాంట్రాక్టర్‌కు కేవలం రూ.62 లక్షలు మాత్రమే చెల్లించడంతో భవన నిర్మాణాన్ని సగంలోనే నిలిపివేశారు. దీనిపై పాలకొండ నగర పంచాయతీ ఏఈ దేవీప్రసాద్‌ను వివరణ కోరగా.. ఆ పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

- సాలూరు పట్టణానికి మూడేళ్ల కిందట రెండు ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. గుమడాం వద్ద స్థలం కేటాయించి ఒక భవనం పనులు ప్రారంభించారు. మరో కేంద్రం కోసం దాదాపు పది సార్లు టెండర్లు పిలిచారు. స్థలం కేటాయించక పోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గుమడాం వద్ద పనులు ప్రారంభించగా మరో రూ.20 లక్షలు అవసరమని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవాలని ఆదేశాలు రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో గుమడాంలో కూడా భవన నిర్మాణం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం సాలూరులో మెంటాడవీధి, బంగారమ్మ కాలనీల్లో అద్దె భవనాల్లో రెండు కేంద్రాలు నడుస్తున్నాయి. ఆయా భవనాల పనులు త్వరితగతన చేపడతామని ఏఈ సూర్యనారాయణ తెలిపారు.

- పార్వతీపురంలోనూ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణంం పూర్తి కాలేదు. తొలుత పట్టణంలోని పాత బెలగాంలో రూ.80 లక్షలతో పనులు ప్రారంభించారు. అయితే ఆ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు మరో రూ.20 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. ఇప్పటివరకు రూ.80 లక్షల మేర భవన నిర్మాణానికి ఖర్చు చేయగా కాంట్రాక్టర్‌కు కేవలం రూ.30లక్షలు మాత్రమే చెల్లించారు. దీనితో ఆ భవన పనులు సగంలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం బెలగాం, ఎస్‌ఎంపీ కాలనీలోని అద్దె భవనాల్లోనే అర్బన్‌ సెంటర్‌ నడుస్తోంది. దీనిపై డీఈ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. భవన నిర్మాణం పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:17 AM